తొలగించిన నిన్నునమ్మం బాబు ఫ్లెక్సీ , చాటగొట్ల విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మళ్లీ ప్రారంభిస్తున్న మంత్రి
పొదలకూరు: ‘మీకు ఎంత దమ్ము, ధైర్యం ఉంటే మా సీఎంకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కడతారు. ఒక మంత్రి వస్తున్నాడన్న మర్యాద, భయం లేకుండా ప్రవర్తిస్తారా? మీ అంతు తేలుస్తా, ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి, లేదంటే లోపలేయిస్తా. మీ ఎమ్మెల్యే రౌడీషీటర్లను వెంటేసుకుని తిరుగుతున్నాడు.’ వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండల పర్యటనలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై శివాలెత్తి చేసిన వ్యాఖ్యలివి. అంతటితో ఆగకుండా బిరదవోలు పంచాయతీ కల్యాణపురంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసుల ద్వారా గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎప్పుడో ఏర్పాటుచేసిన ‘నిన్ను నమ్మం బాబు’ ఫ్లెక్సీలను తొలగించారు.
ఎన్నికల నిబంధనలు త్వరలో అమలవుతున్న తరుణంలో మంత్రి మండలంలో బుధవారం సుడిగాలి పర్యటనలు చేసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మరుపూరు, చాటగొట్ల, పొదలకూరు, అంకుపల్లి, పార్లపల్లి, బిరదవోలు, కల్యాణపురం, విరువూరు, సూరాయపాళెం గ్రామాల్లో సిమెంట్‌రోడ్లు, మంచినీటి పథకాలను ప్రారంభించారు. అయితే మంత్రి పర్యటనలో గ్రామాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలని చూశారని నాయకులు తెలిపారు.
కల్యాణపురంలో అనుచిత వ్యాఖ్యలు
కల్యాణపురం వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా తయారైంది. ఇక్కడ టీడీపీలో పాతికేళ్లపాటు ఉన్న అక్కెం బుజ్జిరెడ్డి గతేడాది వైఎస్సార్‌సీపీలో చేరి ఎమ్మెల్యే కాకాణితో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గ్రామానికి వెళ్లి పరోక్షంగా బుజ్జిరెడ్డిని ఉద్ధేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసులను దగ్గర పెట్టుకుని ఫ్లెక్సీలను తొలగించడంతోపాటు, ఎమ్మెల్యే రౌడీలను వెనకేసుకుని తిరుగుతున్నాడన్నారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే విధంగా ప్రసంగించి వెళ్లారని గ్రామస్తులు వెల్లడించారు. తమ గ్రామంలో ఒక్క అభివృద్ధి పని చేయకున్నా ఎప్పుడో నీరు – చెట్టు పథకంలో చేసిన పనికి శిలాఫలం వేసుకుని వెళ్లారని తెలిపారు.
సగం పూర్తయిన పనులకు శంకుస్థాపనలు
పొదలకూరులో అన్న క్యాంటీన్ భవనం బేస్‌మట్టం పూర్తై పిల్లర్లు నిర్మాణంలో ఉండగా దానికి మంత్రి శంకుస్థాపన చేశారు. చాటగొట్లలో నాలుగేళ్ల క్రితం పూర్తయిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను తిరిగి ప్రారంభించారు. గతంలో సీఈ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించినప్పటికీ. మంత్రి మళ్లీ ప్రారంభించడాన్ని చూసి అధికారులు, ప్రజలు ఆశ్చర్యపోయారు. అంకుపల్లి హరిజనవాడలో 60 శాతం పనులు పూర్తైన వాటర్ ట్యాంకుకు శంకుస్థాపన చేశారు. బిరదవోలులో సీసీ రోడ్లకు శిలాఫలం నిర్మించకుండానే దిమ్మెకు ఆనించి ప్రారంభించడం విశేషం. ఎన్నికల కోడ్ వస్తుందని మంత్రి హైరానా పడుతూ శిలాఫలాలు వేసుకుంటూ వెళుతున్నారని ఆయా గ్రామాల్లో ప్రజలు చర్చించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment