కాకినాడ : సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి తోట నరసింహం సతీమణి వాణీ శనివారం కాకినాడలో ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. వాణీ దీక్షా శిబిరం వద్దకు ఎమ్మెల్యేలు వంగా గీతా, శేషారెడ్డి, పంతం గాంధీ మోహన్ చేరుకుని సంఘీభావం తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ తిరుగుబాటు చేయాలని వాణీ పిలుపు నిచ్చారు.
చిన్నారులు సైతం సమైక్యవాదం వినిపిస్తూ పోరుబాట పడుతున్నారని అన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని టీవీలు చూసే పెద్దలు సైతం ఉద్యమంలో పాల్గోవాలని వాణీ కోరారు. ఉద్యమంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని సమైక్యవాద ఉద్యమకారులకు వాణీ విజ్ఞప్తి చేశారు
సమైక్యాంధ్రకు మద్దతుగా కాకినాడలో జర్నలిస్టులు వినూత్న నిరసన తెలిపారు. కలెక్టరేట్ ఎదుట మూడు రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న జర్నలిస్టులు.. ఇవాళ వేదపండితులతో యాగాలు నిర్వహించారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలంటూ పూజలు నిర్వహించారు. జర్నలిస్టుల నిరసన కార్యక్రమానికి జూనియర్ డాక్టర్లు మద్దతు పలికారు. యాగం చుట్టూ మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు.
ఇక రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో వరుసగా 11రోజూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. స్వచ్ఛందంగా ప్రజాసంఘాలు, విద్యా సంస్థలు, వ్యాపారులు సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో విద్యార్థులు, టీచర్లు మానవహరంగా ఏర్పడి... సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఏలూరు ఆటోమోబైల్ మెకానిక్స్ భారీబైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచాలని లేదంటే రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
సమైక్య నినాదాలతో తిరుపతి హోరెత్తుతోంది. అన్ని వర్గాల వారు ఉద్యమ బాట పట్టడంతో.. 11రోజులుగా జనజీవనం స్తంభించింది. కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. పలుచోట్ల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఓరియంటల్ కళాశాల ఎదుట సమైక్యవాదులు సకలజనుల సామూహిక నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, సినీ నటులు, వైద్యులు, అధ్యాపకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఒంగోలులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనదీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ర్టవిభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వివరణ ఇవ్వాలని వైస్ఆర్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. రాహుల్ ని ప్రధానిని చేసేందుకు, రాష్ర్టాన్ని విభజించాలను కోవడం దారుణమన్నారు. విభజన నిర్ణయాన్ని సోనియాగాంధీ వెనక్కి తీసుకోవాలని లేదంటే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని నాయకులు హెచ్చరించారు.
సమైక్య ఉద్యమంలో స్వచ్చందంగా పాల్గొంటున్న ప్రజలు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ కంచరపాలెం మెట్టులో ఆందోళనకారులు అర్ధనగ్న ప్రదర్సనతో రిలేదీక్షలు చేపట్టారు. సమైక్యవాదుల ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి సతీమణి దీక్ష
Published Sat, Aug 10 2013 3:30 PM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement
Advertisement