సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీకి కోస్తా జిల్లాల్లో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్‌సభలో టీడీపీ పక్షనేత, కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే బాపనమ్మ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్‌పాండ్‌లో భేటీ అయ్యారు. అనంతరం ఆయన సమక్షంలో పార్టీలో చేరారు.
వీరితో పాటు విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, నటుడు రాజారవీంద్ర కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్న నరసింహం ఇప్పటికే టీడీపీకి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నరసింహం చేరికతో ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలం పుంజుకోనుంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్
నటుడు రాజారవీంద్ర
వైఎస్ జగన్ సమక్షంలో..
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో విజయవాడ వెస్ట్ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లు పూర్ణచంద్రరావు, బొచ్చు రమేష్ , అప్పజి తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ రామచంద్రయ్య యాదవ్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కెనపల్లి లక్ష్మయ్య, టీడీపీ మైనార్టీ నేత సాధిక్ భాష, మాజీ ఎంపీటీసీ రమణ వైఎస్సార్‌సీపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment