సాక్షి, విజయవాడ: మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ విజయవాడ 31వ డివిజన్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా మహిళల భద్రత కోసం సీఎం వైఎస్ జగన్ దిశ యాక్ట్ తీసుకువచ్చారని, మహిళలకు అండగా నిలవాలన్న కృతనిశ్చయంతో ఆయన ఈ చట్టం తెచ్చారని కొనియాడారు. మహిళలపై వ్యక్తిగత దూషణలకు దిగినా, కించపరిచినా ఈ కఠిన చట్టం వర్తిస్తుందని తెలిపారు.
దిశ తరహా ఘటనలు మన రాష్ట్రంలో జరగకుండా సీఎం వైఎస్ జగన్ ఈ చట్టం తీసుకువచ్చారని, దిశ ఘటన జరిగిన రాష్ట్రంలో సైతం ఈ చట్టం చేయడానికి ధైర్యం చేయలేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ చట్టం తీసుకురావాలని ప్రధాన మత్రి నరేంద్రమోదీకి మహిళలు లేఖ రాశారని గుర్తుచేశారు. సీఎం జగన్ ముందుచూపుతో ఈ చట్టం తెచ్చారని, అర్ధరాత్రి సైతం మహిళలు రాష్ట్రంలో స్వేచ్ఛగా ఉండేందుకు ఈ చట్టం ఉపకరిస్తుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు జగన్నకు జేజేలు కొడుతున్నారని తెలిపారు. చంద్రబాబు ఈ చట్టాన్ని స్వాగతించిన పరిస్థితి కనబడలేదని, సహకరిస్తానని చెప్తూనే ఆయన అనేక వంకలు పెట్టారని విమర్శించారు. తెలుగుదేశం నాయకులకు మహిళలు అంటే గౌరవం లేదన్నారు.
కారు షెడ్డులో ఉండాలి మహిళలు వంటింట్లో ఉండాలి అన్న నాయకులు ఆ పార్టీ వారని గుర్తు చేశారు. టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ సైతం గతంలో మహిళలు వేసుకునే దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఆడపిల్ల కనబడితే ముద్దు అయినా పెట్టాలి, లేదా కడుపు అయినా చేయాలి అన్న అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోని మహిళలందరూ జగన్న వైపు చూస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్య పోస్టులు పెట్టెవారికి సైతం కళ్లెం వేసేలా ఈ చట్టం తీసుకొచ్చామని, స్పెషల్ కోర్టుల ద్వారా 21 రోజుల్లో కేసు విచారణ పూర్తి చేసి దోషులను శిక్ష పడేలా ఈ చట్టం రూపుదిద్దుకోవడం శుభపరిణామం అని అన్నారు. అంతకుముందు విజయవాడ 31వ డివిజన్‌లో పర్యటించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.. డివిజన్‌లో ప్రజా సమస్యలను అడిగితెలుసుకున్నారు. రెండున్నర కోట్ల రూపాయలతో 31వ డివిజన్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment