సాక్షి, విజయవాడ : దుర్గ గుడి ఉత్సవాలపై కలెక్టర్ ఇంతియాజ్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నవరాత్రులకు సంబంధించిన బ్రోచర్‌ని మంత్రి వెల్లంపల్లి ఆవిష్కరించారు. మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. ఈ నెల 29 నుంచి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సారి గుడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం సవ్యంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఉత్సవాలకు సంబంధించి జాబ్ కార్డులు తయారుచేసి ఆయా డిపార్ట్‌మెంట్లకు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్సవాల భద్రతకు సంబంధించి ఎన్‌సీసీ నుంచి 2వేల మందిని నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఈవో సురేశ్ బాబు, జాయింట్ కలెక్టర్ మాధవిలత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment