
సాక్షి, విజయవాడ: సరస్వతి మాత వసంత పంచమి సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విద్యార్థులకు కంకణం, పెన్నులు, ప్రసాదం అందజేశారు. నేడు(గురువారం) అమ్మవారి జన్మనక్షత్రం కావండంతో ఇంద్రకీలాద్రీ దుర్గామాత సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి దుర్గమాతను దర్శించుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరికి జ్ఞానం కలగాలని, మంచి జరగాలని సరస్వతి యాగం నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా అమ్మవారి దర్శనార్థం స్థానిక పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు దుర్గగుడికి తరలివచ్చారు. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకున్నారు. అందరికిఅమ్మవారి ఆశీస్సులు అందేలా ఏర్పాట్లు చేశామని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకం ద్వారా రూ. 15వేలు ప్రతి విద్యార్థికి అందిస్తున్నామన్నారు. మధ్యాహ్నం భోజన పథకంలో నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.