విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీల్లో లుకలుకలు చోటుచేసుకుంటున్నాయి. దండిగా కాసులు వచ్చే పోస్టుల్ని వదులుకునేందుకు ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. ఇందుకోసం పొలిటికల్ గాడ్‌ఫాదర్‌లను ఆశ్రయిస్తున్నారు. ఆర్‌ఐ (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్) పోస్టుల బది‘లీల’కు సంబంధించి కొందరు యూనియన్ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవలే ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటీన్ వద్ద పంచాయితీ పెట్టి మరీ ఉద్యోగులు ఆక్రోశం వ్యక్తం చేసినట్లు సమాచారం.
కార్పొరేషన్‌లో మూడేళ్లు పూర్తి చేసుకున్న 65 మంది మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు పరిపాలనా విభాగం అధికారులు (సి-సెక్షన్) ఫైలు సిద్ధం చేశారు. ప్రతి మూడేళ్లకూ ఓసారి మినిస్టీరియల్ ఉద్యోగుల్ని అంతర్గత బదిలీలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రజారోగ్య, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, యూసీడీ తదితర విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్, సీనియర్, రికార్డు అసిస్టెంట్లు, సూపరింటెండెంట్ స్థాయిలో బదిలీ చేసేందుకు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి.
మినహాయింపుపై గుర్రు
మూడు సర్కిళ్ల పరిధిలో 13 ఆర్‌ఐ పోస్టులు ఉన్నాయి. ఇందులో తొమ్మిది మందికి మూడేళ్లు నిండాయి. రెవెన్యూ విభాగంలో ఆర్‌ఐ పోస్ట్‌కు మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ పోస్టుల్ని బదిలీల నుంచి మినహాయించే ప్రయత్నాలకు తెరలేచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన మూడు, నాలుగేళ్లుగా ఆర్‌ఐలుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులు కొద్ది నెలల క్రితం సర్కిళ్లు మారారు. దీంతో తమకు బదిలీలు వర్తించవనే కొత్త వాదనకు తెరతీయడం వివాదాస్పదంగా మారింది.
గతంలో ఆర్‌ఐలుగా విధులు నిర్వహించిన ముగ్గురికి ఇటీవలే నాటకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఆర్‌ఐ పోస్టులే దక్కాయి. సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి ఆర్‌ఐ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. గతంలో ప్రవీణ్ ప్రకాష్ కమిషనర్‌గా ఉన్న సమయంలో సమర్థత ఉంటే జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి ఆర్‌ఐలుగా ఎంపిక చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ దఫా బదిలీల నుంచి ఆర్‌ఐలను మినహాయిస్తే మరో మూడే ళ్ల వరకు వారే ఆ పోస్టుల్లో కొనసాగే అవకాశముంటుంది. దీనిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఆర్‌ఐ పోస్టుల్ని దక్కించుకోవాలనుకొనే ఆశావహులు అన్ని విభాగాల్లో బదిలీలు జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇటీవలే మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బదిలీల అంశాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా అదనపు కమిషనర్‌కు ఆ బాధ్యతల్ని అప్పగించారు.
యూనియన్‌కు బదిలీల సెగ
బదిలీల అంశం యూనియన్‌లోనూ విభేదాలకు తావిస్తోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొందరికి లబ్ధి చేకూర్చేలా యూనియన్ నాయకులు వ్యవహరిస్తున్నారంటూ ఉద్యోగులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పారదర్శకంగా బదిలీలు జరగకుంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. వచ్చే ఆగస్టులో కృష్ణా పుష్కరాలు జరగనున్న దృష్ట్యా కొన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయించాల్సిందిగా ఆయా విభాగాధిపతులు కమిషనర్‌ను కోరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకు కమిషనర్ అంగీకరించే పక్షంలో మొత్తం బదిలీలను తాత్కాలికంగా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. పుష్కరాలు అయ్యాక బదిలీలు చేస్తే ఏ ఇబ్బందీ ఉండదన్న వాదన వినిపిస్తున్నారు.
మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీల్లో లుకలుకలు!
Published Wed, Apr 27 2016 2:52 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM
Advertisement
Advertisement