ముస్లింలకు దగా
ముస్లింలకు దగా
Published Mon, Apr 3 2017 9:18 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీలకు చోటు కల్పించని చంద్రబాబు
► మేమేం పాపం చేశామంటున్న ముస్లింలు
► వక్ఫ్, హజ్ యాత్రికుల సమస్యలు ముస్లిమేతరులకు ఎలా తెలుస్తాయని నిలదీత
► వచ్చే ఎన్నికల్లో సత్తా చూపుతామని హెచ్చరిక
కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లింలకు మరోసారి మొండిచేయిచూపించారు. తాజాగా చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో కూడా వారికి చోటు కల్పించలేదు. దీంతో జిల్లాలోని ముస్లింలు బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మైనారిటీ వ్యతిరేకిలా మారిందని విమర్శిస్తున్నారు. మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు ఏర్పరుచుకున్న తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నాయకులను ఎదగనివ్వకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ సంక్షేమ శాఖను ముస్లిమేతరులకు ఇస్తే మసీదులు, వక్ఫ్, హజ్ యాత్రికులు ఎదర్కొంటున్న సమస్యలు ఎలా తెలుస్తాయని, మైనారిటీల సంక్షేమం కోసం ఎలా పని చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కనీసం పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారిని కూడా చంద్రబాబు గుర్తించడం లేదని వాపోతున్నారు. నంద్యాలకు చెందిన సీనియర్ మైనారిటీ నేత ఎన్‌ఎండీ ఫరూక్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి అందులోనే ఉన్నారు. పార్టీకి వీర విధేయుడిగా పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తిని గుర్తించకపోవడం, పదవులు ఇవ్వకపోవడం దారుణమని పేర్కొంటున్నారు. ముస్లింల వ్యతిరేకి చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేస్తున్నారు.
టీడీపీ మతోన్మాదం వైపు నడుస్తోంది: తెలుగుదేశం పార్టీ క్రమంగా మతోన్మాదంవైపు అడుగులేస్తోంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో ఒక్క ముస్లింకి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అలా మైనారిటీలను అణిచివేయాలనే ధోరణి చంద్రబాబులో కూడా మొదలైంది. ముస్లింలు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. చంద్రబాబు అసలు రూపం తెలుసుకోవాలి. ఆత్మాభిమానం ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆపార్టీకి తగిన బుద్ధి చెప్పాలి.-ఎంఎ.గఫూర్, సీపీఎం మాజీ ఎమ్మెల్యే
ముస్లింలను అవమానించిన చంద్రబాబు: కేబినెట్ విస్తరణలో మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముస్లింలను అవమానించారు. అన్ని వర్గాలకు సమాన హక్కులు, పదవులు కల్పించాలని రాజ్యాంగం చెబుతుంది. టీడీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా మైనారిటీలను విస్మరించడం దారుణం.-మౌలాన హాఫీజ్ ఖాజీ అబ్దుల్ మాజిద్, ముస్లిం జేఏసీ చైర్మన్, జామేతే ఉలమా జిల్లా అధ్యక్షుడు
ప్రజల్లోకి ఎలా వెళ్లాలి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో మైనార్టీలకు స్థానం కల్పించకుండా అన్యాయం చేశారు. జనాభాలో 12శాతం మంది ఉన్న ముస్లింలు ఆయనకు గుర్తుకు రాకపోవడం సరికాదు. త్వరలో నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల్లో ముస్లింల వద్దకు వెళ్లి ఓటు ఎలా అడగాలి. -ఎన్‌ఎండీ ఫిరోజ్, నంద్యాల టీడీపీ యువనేత
హామీలతో మభ్యపెడుతున్నారు: చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లింలను అణచివేస్తూనే ఉన్నారు. పదవులు ఇవ్వకుండా హామీలతో మభ్యపెడుతున్నారు. ప్రస్తుతం మంత్రి వర్గంలో మళ్లీ ముస్లింలకు అన్యాయం జరిగింది. ముస్లింలందరూ సంఘటితమై బాబుకు గుణపాఠం చెప్పాలి.– ఖాద్రి, రాష్ట్ర కార్యదర్శి, వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం
Advertisement
Advertisement