సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీపై మైనార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే తమకు అన్యాయం చేస్తున్నారని, పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా పైరవీకారులకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కర్నూలుకు చెందిన మైనార్టీ నేత, టీడీపీ యువజన విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు పర్వేజ్ సోషల్ మీడియా సాక్షిగావిమర్శలు గుప్పించారు. శ్రీశైలం నియోజకవర్గంలో తమను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తీరుపై రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్, ఆత్మకూరుకు చెందిన మైనార్టీ నేత అహ్మద్ హుస్సేన్ బహిరంగంగా మండిపడ్డారు. అలాగే ప్రస్తుతం నంద్యాలకు చెందిన మైనార్టీ నేత, మాజీ కౌన్సిలర్ మిద్దె ఉస్సేని ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పరంగా రావాల్సిన పదవుల విషయంలోనూ, నామినేటెడ్ పోస్టుల అంశంలోనూ తమను విస్మరిస్తున్నారని అధికార పార్టీకి చెందిన మైనార్టీ నేతలు అంటున్నారు. మైనార్టీల కోసం కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన హజ్‌హౌస్‌ను కూడా అడ్డుకున్నారని మండిపడుతున్నారు. మొత్తంగా అధికార పార్టీపై మైనార్టీ నేతల తిరుగుబావుటా జిల్లాలో చర్చనీయాంశమవుతోంది.
ఇదేనా మీరిచ్చే గౌరవం!
బీజేపీతో పొత్తు ఉన్నంత వరకు మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు ఎన్నికల తరుణంలోకేవలం మభ్యపెట్టడానికే ఫరూఖ్‌కు పదవి ఇచ్చిందన్న విమర్శలున్నాయి. అది కూడా ఫరూఖ్‌కు మాత్రమే మంత్రి పదవి ఇచ్చి ఇతర నేతలను విస్మరిస్తోందని మైనార్టీలు మండిపడుతున్నారు. ఇదే విషయమై తాజాగా నంద్యాలకు చెందిన మాజీ కౌన్సిలర్ మిద్దె ఉస్సేని పార్టీకి రాజీనామా చేశారు. ఈయన టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నారు. మూడుసార్లు నంద్యాల మునిసిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. టీడీపీ తరఫున కౌన్సిల్ ఫ్లోర్ లీడర్‌గానూ ఉన్నారు. అయితే, తాజా పరిణామాలతో విసుగెత్తి ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా టీడీపీలో మైనార్టీలకు దక్కుతున్న గౌరవం ఇదేనా అంటూ మంత్రి ఫరూక్‌ను నిలదీశారు.
మైనార్టీలపై ప్రేమ లేదు..
మైనార్టీలపై టీడీపీకి మొదటి నుంచీ ప్రేమ లేదని, అందుకే బీజేపీతో పొత్తు ఉన్నంత వరకూ మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించలేదన్న అంశాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. పార్టీ తీరు ఇదే విధంగా ఉంటే మైనార్టీల నుంచి కనీస మద్దతు కూడా దక్కే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. కర్నూలులో ముస్లిం మైనార్టీల జనాభా అధికం. దీంతో ఇక్కడ హజ్‌హౌస్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం శంకుస్థాపన కూడా చేశారు. అయితే..చివరకు హజ్‌హౌస్ ఏర్పాటు చేయకుండా గుంటూరుకు తరలించారు. ఇక ఆత్మకూరు పట్టణంలో తమను కనీసం పట్టించుకోవడం లేదంటూ మంత్రి ఫరూక్ ఎదుటే మైనార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. మొత్తంగా అధికార తెలుగుదేశం పార్టీపై మైనార్టీ నేతలు ఒక్కొక్కరుగా నిరసన వ్యక్తం చేస్తూ.. బయటకు వచ్చి ఎదురు తిరిగే పరిస్థితి కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment