ఎర్రబడ్డ మిర్చి రైతు | Mirchi Farmers Demands hike in Minimum Support Price | Sakshi
Sakshi News home page

ఎర్రబడ్డ మిర్చి రైతు

Published Fri, May 5 2017 1:26 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM

ఎర్రబడ్డ  మిర్చి  రైతు - Sakshi

ఎర్రబడ్డ మిర్చి రైతు

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన
కేంద్రం ప్రకటించిన పథకాన్నిఅమలు చేయని టీడీపీ సర్కారు
దారుణంగా దిగజారిన ధరలు
నాటు రకం మిర్చిని కొనేందుకు నిరాకరిస్తున్న వ్యాపారులు
హైబ్రిడ్‌ రకాల ధరలూ తగ్గింపు


సాక్షి, అమరావతి బ్యూరో
గుంటూరు మిర్చి యార్డులో రోజు రోజుకూ ధరలు పతనం అవుతుండటంపై రైతులు కన్నెర్ర చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు.. మిర్చి యార్డులో ధరలు తగ్గటంతో  కడుపు మండిన రైతులు గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ కోల్‌కతా–చెన్నై హైవేతో పాటు గుంటూరు–కర్నూలు రాష్ట్ర ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. మిర్చికి మద్దతు ధర కల్పించాలంటూ డిమాండ్‌ చేశారు. తమను పట్టించుకోవడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాటు రకం మిర్చి కొనుగోలుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు. హైబ్రిడ్‌ (తేజ)రకం హై క్వాలిటీ మిర్చిని సైతం క్వింటాలు రూ. 2,500 నుంచి రూ. 3,000కు మించి కొనుగోలు చేయకపోవడం,

 సాధారణ రకం
మిర్చిని అయితే మరి దారుణంగా క్వింటాలు రూ. 1,500 రూ. 2,000 మధ్య ధర ఉండటంతో రైతులు కన్నెర్ర చేశారు. రోజుల తరబడి యార్డులో పడిగాపులు కాస్తున్నా మిర్చి అమ్ముకునేందుకు అవకాశం లేక అవస్థలు ఎదుర్కొం టున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీం ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మిర్చి ధరలు మరింత పతనమయ్యాయి.

వందలాది లారీల్లో సరుకు...
మార్కెట్‌ యార్డులో నాటు రకం మిరపకాయలు కొనుగోలు చేయకపోవడం, మిర్చి ధరలను తగ్గించి వ్యాపారులు అడ గటంతో రైతన్నలు మిర్చిని అమ్మేందుకు నిరాకరిస్తుం టంతో మార్కెట్‌ యార్డులో పెద్ద ఎత్తున సరుకు పేరుకుపోయింది. వందల సంఖ్యలో మిర్చి లారీలు మార్కెట్‌ యార్డు బయట ఆగిపోయాయి. ప్రభుత్వం ప్రకటించిన రాయితీ వర్తించేటట్లు అయితే మేం మిర్చి కోనుగోలు చేయబోమని కొంత మంది వ్యాపారులు మెలిక పెడుతున్నట్లు రైతన్నలు వాపోతున్నారు. క్వింటాలుకు హైగ్రేడ్‌ తేజ క్వాలిటీ రకం గురువారం ఓ వ్యాపారి కేవలం రూ. 3వేలకు కొనుగోలు చేస్తే.. మరో వ్యాపారి ఇంకో రైతుకు అదే రకానికి రూ. 2,500 ఇస్తానని చెప్పాడు. మార్కెట్‌లో దించిన సరుకు మళ్లీ ఇళ్లకు తీసుకపోరు అనే భావనతో వ్యాపారులు ఉన్నారని రైతులు వాపోతున్నారు.

గందరగోళంగా కొనుగోళ్లు....
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ పథకం కింద ఇచ్చే రూ.5 వేలే సరిపోదని రైతులు గగ్గోలు పెడుతుంటే దానిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ. 1,500 సహాయం పథకమే ప్రస్తుతం అమలులో ఉందని మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలు రూ. 5,000 పథకం రాష్ట్ర పరిశీలనలో ఉందని, దీనిని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని సమాచారం. రెండు పథకాలు వర్తిస్తాయని పెద్ద సంఖ్యలో రైతులు యార్డుకు సరుకు తీసుకువచ్చారు.

 ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యాపారుల కుమ్మక్కు నేపథ్యంలో గురువారం రైతన్నలు రోడ్డెక్కడంతో పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన పోలీసులు అర్బన్‌ ఎస్పీ త్రిపాఠి పర్యవేక్షణలో యార్డు వద్ద మొహరించారు. గుంటూరు జెసీ–2 ముంగా వెంకటేశ్వరావు రైతులకు నచ్చజెప్పడానికి యార్డు కార్యా లయంలో రైతులతో సమావేశ మయ్యారు. మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మన్నవ సుబ్బారావును పలువురు రైతు లు నిలదీశారు. యార్డు కార్యాలయం నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ రైతులు శాపనార్థాలు పెట్టారు.

నాటు రకం కాయలు కొనలేదయ్యా..
గుంటూరు మార్కెట్‌ యార్డులో  మిర్చి తెచ్చి పదిరోజులుగా పడిగాపులు కాస్తున్నారు. మచ్చు (శాంపిల్‌) తీసి వ్యాపారులు కాయలు కొనటం లేదయ్యా. కనీసం క్వింటాలు రూ.1,000 కూడా అడగటం లేదు. సరుకు వదిలి వెళ్లలేక పది మంది రైతులం ఇక్కడే ఉంటున్నాం. కనీసం భోజన టోకెన్లు కూడా ఇవ్వటం లేదు. కడుపు మాడ్చుకొంటున్నాం. ప్రభుత్వం కనీసం పట్టించుకోవటం లేదు.
– బి.వెంకటేశ్వర్లు, కర్నూలు జిల్లా

తేజ మిర్చి రూ. 2,500కు అడుగుతున్నారయ్యా..
నేను వారం క్రితం 110 బస్తాల తేజ రకం మిర్చి తీసుకొని వచ్చా. రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించక ముందు క్వింటాలు రూ.7000కు అడిగారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు రూ. 5000 ప్రకటించక ముందు ధర రూ. 6000 ఉంది. ఈ ప«థకం ప్రకటించాక వ్యాపారులు మిర్చిని క్వింటాలు రూ. 3000 అడిగారు. మళ్లీ అంతలోనే ఇంకొక వ్యాపారి రూ. 2500 ఇస్తే తీసుకొంటాం లేకపోతే లేదంటున్నారు. వారం రోజులుగా ఇక్కడే ఉంటున్నా. ఆత్మహత్య తప్ప శరణ్యం లేదు. ప్రభుత్వం మిర్చి రైతులను పట్టించుకోలేదు. చిన్న చూపు చూస్తోంది.
– పువ్వాడ కోటయ్య, కందుకూరు ప్రకాశం జిల్లా

సరుకు కొనుగోలు చేయడం లేదు..
ప్రభుత్వం ప్రకటించిన రాయితీ అర్హత కోసం పత్రాలు ఉంటే ఆ సరుకు కొనడం లేదు. ఫారాలు ఇవ్వకుండా, రాయితీ పరిధిలోకి సరుకు రాకుంటేనే వ్యాపారులు కొంటామంటున్నారు. ఇలా వ్యాపారులు మూడు రోజులుగా మిర్చిని కొనడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ధరలు పడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.
– శ్రీనివాసరావు, నాదెండ్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement