
మిరప రైతు గగ్గోలు
► క్వింటా ధర రూ.2,500లోపు
► ధర నేలను తాకడంతో రైతుల కంట కన్నీరు
► సాధారణ సాగు 15,567 హెక్టార్లు
► సాగయిన పంట 24,494 హెక్టార్లు
► వడ్డీలకూ సరిపోని దిగుబడి
కర్నూలు(అగ్రికల్చర్): మిరప రైతు ఎప్పుడూ లేని విధంగా నష్టాలను మూటగట్టుకున్నాడు. 2015లో కాసులు పండినా.. ఆ తర్వాత ఏడాది ఈ పంట కన్నీరు మిగిల్చింది. అప్పట్లో రూ.10వేలకు పైగా ధర పలికిన మిరప ధర ఇప్పుడు నేలను తాకింది. విత్తనాల కొరత ఏర్పడినా ఎంతో ఆశతో అధిక ధరలతో కొనుగోలు చేసి పంట సాగు చేస్తే పెట్టుబడి కూడా దక్కకని పరిస్థితి నెలకొంది. సాధారణ సాగు 15,567 హెక్టార్లు కాగా.. 24,494 హెక్టార్లలో పంట సాగయింది. కిలో విత్తనం ధర రూ.20వేల వరకు పలికిందంటే ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ఎరువులు, పురుగు మందులు, కూలీలు, ఇతరత్రా ఖర్చులు ఎకరాకు రూ.లక్షలకు పైగా పెట్టుబడిగా పెట్టారు. అయితే పెట్టుబడిలో 20 శాతం కూడా దక్కకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు గగ్గోలు పెడుతున్నారు.
గత ఏడాది ఇదే సమయంలో క్వింటా ఎండు మిర్చి ధర రూ.10వేల నుంచి రూ.12వేలు పలికింది. ప్రస్తుతం ధర రూ.3వేలు కూడా మించని పరిస్థితి ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాకు లభిస్తున్న ధర రూ.2వేల నుంచి రూ.2,500 మాత్రమే. మిర్చి క్రయ, విక్రయాలకు గుంటూరు మార్కెట్ ప్రసిద్ధి. అక్కడ కూడా ధర నేలను తాకింది. ఆలూరు, పెద్దకడుబూరు, శిరువెళ్ల, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. మరికొందరు రైతులు భార్యల బంగారం ఆభరణాలు తాకట్టుపెట్టి మిరప పంట సాగు చేశారు. అయితే చీడపీడల కారణంగా దిగుబడులు కూడా పడిపోవడం.. ధర కూడా అంతంతే కావడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
మిరపకు మద్దతు ధర ఏదీ: వివిధ పంటలకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిని బట్టి కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. ఇటు జిల్లాలోను, అటు రాష్ట్రంలోను సాగు చేసే ప్రధాన పంటల్లో ఎండు మిర్చి ఒకటి. ప్ర«ధాన పంటగా గుర్తింపు ఉన్నా.. మద్దతు ధర కరువయింది. కనీస మద్దతు ధర ఉంటే ధరలు పడిపోయినపుడు ప్రభుత్వం నాఫెడ్, మార్క్‌ఫెడ్‌లను రంగంలోకి దింపి మద్దతు ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. కానీ ఎండు మిర్చికి కనీస మద్దతు ధర లేకపోవడంతో ధరలు నేలను తాకినా పట్టించుకునే వారు కరువయ్యారు. మిరప రైతులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం చెవికెక్కించుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో కనీసం 12వేల మంది రైతులు మిరప సాగు చేశారు. ఇందులో ఒక్క రైతుకు కూడా పెట్టుబడిలో సగం కూడ దక్కలేదంటే నష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టం అవుతోంది.
మూడెకరాల్లో ఎండు మిర్చి సాగు చేసిన. ఎకరాకు రూ.లక్ష ప్రకారం రూ.3లక్షలు పెట్టుబడి పెడితే 35 క్వింటాళ్ల పంట వచ్చింది. క్వింటాకు లభించిన ధర రూ.2వేలు మాత్రమే. అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడంతో రూ.2.30 లక్షల నష్టం వచ్చింది. పంట అమ్మితే వచ్చిన డబ్బు వడ్డీలకే సరిపోయింది. ఈ ఏడాది చానా నష్టపోయినం. ---నీలప్ప, బూదూరు, మంత్రాలయం మండలం
కనీస మద్దతు ధర ప్రకటించాలి: రెండు ఎకరాల్లో మిరప సాగు చేసినం. రూ. 2లక్షలకు పైగా పెట్టుబడి అయ్యింది. 20 క్వింటాళ్ల వరకు పంట వచ్చింది. అయితే మార్కెట్‌లో ధర రూ.2500లే లభించింది. ఈ ధరతో రైతులు ఎట్లా బాగుపడతారు. పంటను అమ్మగా వచ్చిన డబ్బు వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. క్వింటాకు కనీసం రూ.7500 ధర ఉంటే రైతులకు కొంత గిట్టుబాటు అవుతుంది.
--- నబిషా, కున్నూరు, గొనెగండ్ల మండలం