అందరి సహకారంతో అభివృద్ధి చేస్తా
ఎన్నికలకు ముందు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని గ్రామాలకు కృష్ణా మంచినీటిని అందించడానికి కృషి చేస్తా. ప్రణాళికాబద్ధంగా అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పడు సమీక్ష సమావేశాలు నిర్వహించి అభివృద్ధికి కృషి చేస్తా. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ వారితో సఖ్యతతో ఉండి మిర్యాగూడ నియోజకవర్గానికి అధిక నిధులు వచ్చేలా కృషి చేస్తా. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో అతిపెద్ద పట్టణంగా ఉన్న మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తా. ఇందుకు ఇక్కడ అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. మిర్యాలగూడ పట్టణంలో ఎంతో కాలంగా ఉన్న కేఎన్‌ఎం డిగ్రీ కళాశాల సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తా. కళాశాలలో అవసరం మేరకు ఉద్యోగులను ప్రభుత్వ పరం చేయడానికి ప్రయత్నిస్తా. అవసరమైతే అసెంబ్లీలో కేఎన్‌ఎం కళాశాల గురించి మాట్లాడుతా.
పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
మిర్యాలగూడ పట్టణంలోని అన్ని వార్డులతో పాటు అన్ని కాలనీలు పర్యటించి వాస్తవంగా ఎక్కడ మంచినీటి సమస్య ఉందో తెలుసుకుంటా. పట్టణ ప్రజానీకానికి రాబోయే 20 సంవత్సరాలకు సరిపడా మంచినీటి పథకాన్ని రూపొందించి మంజూరు చేయిస్తా. పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యలేకుండా పరిష్కరిస్తా. అదే విధంగా పట్టణంలో అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పూర్తి చేయిస్తా. పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాలతో పాటు బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయిస్తా. పట్టణంలోని సాగర్ రోడ్డులో ఆరులేన్ల రోడ్డుగా విస్తరణ చేపడతా. రాజీవ్‌చౌక్ నుంచి సాగర్ రోడ్డులోని రైల్వే ట్రాక్ వరకు ఆరులేన్ల రోడ్డువిస్తరణ చేయిస్తా.
సాగునీటికి ప్రాధాన్యం
నియోజకవర్గంలో సాగునీటికి అధిక ప్రాధాన్యమిచ్చి రైతులకు మేలు చేయడానికి కృషి చేస్తా. దామరచర్ల మండలంలో కృష్ణానదిపై రెండు చోట్ల ఎత్తిపోతల పథకాలను కొత్తగా నిర్మించడానికి నిధులు మంజూరు చేయిస్తా. వజీరాబాద్, ముదిమాణిక్యం మేజర్ల లైనింగ్ పూర్తి స్థాయిలో చేయిస్తా. అదే విధంగా వేములపల్లి మండలంలోని ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాలను పూర్తి స్థాయిలో ఆధునికీకరణ చేయిస్తా. అదే విధంగా మూసీ కాలువలు ఆధునికీకరించి చివరి భూములకు సాగు నీరందే విధంగా ప్రయత్నం చేస్తా.
భీమారం - సూర్యాపేట రోడ్డు అభివృద్ధికి పాటుపడతా
మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న భీమారం - సూర్యాపేట రోడ్డు అభివృద్ధికి కృషి చేస్తా. ఆ రోడ్డును డబుల్ రోడ్డుగా చేస్తూ రూ. 25 కోట్లతో నిర్మిస్తా. అదే విధంగా వేములపల్లి మండలంలోని కామేపల్లి వద్ద ఉన్న కాజ్‌వే నిర్మిస్తా. ఇంకా నియోజకవర్గంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తా.
లోఓల్టేజీ సమస్యను పరిష్కరిస్తా
ముఖ్యంగా వేములపల్లి మండలంలో లోఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఆ సమస్యను అధిగమించడానికి అవసరమైన చోట సబ్‌స్టేషన్లు నిర్మించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. మిర్యాలగూడ, దామరచర్ల మండలాల్లో కూడా లోఓల్టేజీ సమస్యను పరిష్కరించడానికి విద్యుత్ అధికారులతో చర్చించి నిధులు విడుదల చేయిస్తా. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలి.