డామిట్, మాట జారిపోయింది.! తప్పయిపోయింది సారీ! ఆ ఎమ్మెల్యే పరేషాన్
ఎప్పుడూ మంత్రి కాలేదు. కాని మంత్రి కంటే ఎక్కువగానే అధికారాలు అనుభవించారు. ప్రత్యేక రాష్ట్రం రాగానే రాజకీయ గురువుకు సున్నం పెట్టాడు. గెలిపించిన పార్టీకి పంగనామాలు పెట్టి అధికార పార్టీలో చేరిపోయాడు. మూడోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్న ఆ నేత ఇటీవల పదే పదే జనానికి సారీ చెబుతున్నాడు. అనవసరపు చిక్కులు కొని తెచ్చుకుంటున్నాడు. సీనియర్ ఎమ్మెల్యేకు సారీ చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇంతకీ ఆ నేత ఎవరు?
కాంగ్రెస్కు చేయిచ్చి.. ఆ వెంటనే కారెక్కి.!
ఎంతటి నాయకులైనా నోరు జారితే తిరిగి వెనక్కు తీసుకోలేరు. ఒక ఎమ్మెల్యే స్థాయి నేత పబ్లిక్లో ఇష్టారీతిన కామెంట్స్ చేస్తే అటు ఆయనకు.. ఇటు పార్టీకి కూడా నష్టం తప్పదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావుకు ఇప్పుడదే జరిగింది. గతంలో రెండు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డికి షాడోగా వ్యవహరించిన వ్యక్తి.
ఆయన అండదండలతో.. 2014లో రాజకీయాల్లోకి వచ్చీరాగానే.. మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ టికెట్ పొందారు. ఎమ్మెల్యే కాగానే గురువును వదిలేసి గులాబీ పార్టీలో చేరిపోయారు భాస్కరరావు. 2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకుని మరోసారి పోటీ చేసి గెలిచారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్య ఎమ్మెల్యే భాస్కరరావు చేస్తున్న వ్యాఖ్యలు ఆయనతో పాటు గులాబీ పార్టీని కూడా ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రోడ్లతో రాజకీయమా?
ఆ మధ్య అడవిదేవులపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో..సీసీ రోడ్ల ప్రారంభోత్సం సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు రాజకీయంగా దుమారం రేపాయి. మేము వేయించిన రోడ్లపై నడవద్దు, మేము ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకోవద్దని.. తాను తలుచుకుంటే ఐదు నిమిషాల్లో డ్యాన్సులు చేయిస్తానంటూ ప్రతిపక్షాలే లక్ష్యంగా ఆయన మాట్లాడిన మాటలు ఆయనకు..పార్టీకీ డ్యామేజ్ చేసేవిగా మారాయి. జరిగిన నష్టం గమనించిన ఆయన తన వ్యాఖ్యలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ ఘటన మరిచిపోకముందే మరో కార్యక్రమంలోనూ ఇదేరకంగా నోటి దురుసును ప్రదర్శించారాయన.
మిర్యాలగూడలో జరిగిన దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమం సందర్బంగా ఎంపీపీ సరళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రెండు కులాల పేర్లను ప్రస్తావిస్తూ... ఆ వర్గాలు చేసే పనులు కూడా నేనే చేయాలా అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. ఈ వీడియోలు బయటకు రావడం, వైరల్ కావడంతో మరోసారి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు నోటి దురుసు గురించి చర్చ మొదలైంది. బీసీ సంఘాలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొందరైతే ఎమ్మెల్యేకు ఫోన్లు చేసి నిరసన వ్యక్తం చేశారట. రెండు రోజులపాటు ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో.. ఎవరికి క్షమాపణలు చెప్పాల్సి వస్తుందోనన్న ఆందోళన ఆయనలో కన్పించిందని అనుచరులే చెప్పారు.
సారీ.. ఆ ఒక్కటి పట్టించుకోవద్దు
దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన భాస్కరరావు క్షమాపణలు చెప్తూ వీడియో విడుదల చేశారు. తాను కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ఎమ్మెల్యే.. కొంతకాలంగా పదే పదే నోరు జారడానికి ఆయనలో పెరుగుతున్న టెన్షన్ కారణం కావచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా? రాదా? అన్న అనుమానం ఒకటైతే.. సీపీఎంతో పొత్తు కుదిరితే మిర్యాలగూడ కేటాయించాల్సి వస్తే తన రాజకీయ భవిష్యత్తు ఏమౌతుందోనని భాస్కరరావు ఆందోళన చెందుతున్నారట.
దీంతో పాటు ఈసారి తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని కూడా ఆయన అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో సీటు సీపీఎంకు కేటాయిస్తే.. ఇటు తన రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారడంతో పాటు కొడుకు రాజకీయ అరంగేట్రం కూడా ఆలస్యం అవుతుందన్న ఆందోళనే ఆయన నోరు జారుడుకు కారణంగా విశ్లేషిస్తున్నారు. పైగా తరచుగా వివాదాల్లో చిక్కుకోవడంతో పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం నేతలు సంబరాలు చేసుకుంటున్నారట. ఓ నేత అయితే ఏకంగా తన అనుచరులకు పార్టీ ఇచ్చారని మిర్యాలగూడలో ప్రచారం సాగింది.
ఒకనాడు జానారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పిన నల్లమోతు భాస్కరరావు ఇప్పుడు ప్రతీ దానికి.. ఫోన్ చేసిన ప్రతీ వ్యక్తికి క్షమాపణలు చెప్పాల్సి రావడం అంటే.. ఆయన స్వయంకృతాపరాధమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే నోటి దురుసుతనానికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని ప్రత్యర్థులు పండుగ చేసుకుంటున్నారు.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్