గేట్లు విరిచి.. క్యూలైన్లోకి దూసుకెళ్లారు..
తిరుమల : ఏకాదశి దర్శనం కోసం తిరుమలలో భక్తులు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. టీటీడీ సామాన్య భక్తులను పట్టించుకోకుండా వీఐపీలకు పెద్దపీట వేస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు గురువారం ఉదయం లేపాక్షి సర్కిల్ వద్ద వీఐపీలను అడ్డుకుని నిరసన తెలిపారు.
మరోవైపు వెంకన్నను ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులతో కొండ కిక్కిరిసిపోయింది. గత రాత్రి 8 గంటలకే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని లైన్లు నిండిపోయాయి. టీటీడీ అధికారులు ముందు జాగ్రత్తగా క్యూల్లోకి భక్తులను అనుమతించలేదు. దీంతో సహనం కోల్పోయిన భక్తులు శంకుమిట్ట కాటేజ్ వద్ద క్యూ గేట్లను విరిచారు. మరికొందరు రాళ్లతో తాళాలను పగుల గొట్టి, క్యూలోకి దూసుకెళ్లారు. క్యూ కట్టిన ఇనుప కంచె కూడా విరిగి కిందపడ్డాయి.క్యూలోకి దూసుకెళ్లారు. పోలీసు, భద్రతా సిబ్బంది అడ్డుచెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదు.