రేయ్.. పనులాపు!
► రైల్వే కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపు
► డీజిల్‌షెడ్ పనుల అడ్డగింత
► టీఎస్‌ఆర్ కంపెనీ సిబ్బందిపై దౌర్జన్యం
గుంతకల్లు : రేయ్.. ఒక్కసారి చెబితే మీకు అర్థం కాదా?! మా ఏరియాలో పనులెలా చేస్తారో చూస్తాం. వెంటనే ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయ్’ అని గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ అనుచరులు బెదిరించారు. ఫలితంగా గుంతకల్లు రైల్వే డీజిల్ షెడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి. టీఎస్‌ఆర్ కంపెనీ ఇప్పటికే రూ.9 కోట్లతో డీజిల్‌షెడ్ అభివృద్ధి పనులను చేస్తోంది. మరో రూ.15 కోట్ల పనులకు గత మంగళవారం జోనల్ స్థాయి అధికారులు టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్‌ను దక్కించుకునేందుకు గుంతకల్లు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడైన రైల్వే కాంట్రాక్టర్ సురేష్‌నాయుడు తీవ్రంగా ప్రయత్నించాడు.
మిగిలిన కాంట్రాక్టర్లతో రాయ‘బేరాలు’ నడిపి అంతా ఓకే చేసుకున్నాడు. అయితే..చివరి నిమిషంలో టెండర్‌ను టీఎస్‌ఆర్ కంపెనీయే కైవసం చేసుకుంది. దీన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. గత శనివారం 25 మంది అనుచరులతో వెళ్లి పనులను అడ్డగించాడు. అప్పుడు నిలిచిన పనులను టీఎస్‌ఆర్ కంపెనీ రెండు రోజుల కిందట తిరిగి ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్ సురేష్‌నాయుడు, కౌన్సిలర్ సంజీవులు, చోటామోటా నాయకులతో కలిసి సోమవారం పనులు జరుగుతున్న ప్రాంతానికి వె ళ్లారు. టీఎస్‌ఆర్ కంపెనీ సిబ్బందిని పరుష పదజాలంతో దూషించారు.
తమకు లాభాల్లో భాగం కానీ, గుడ్‌విల్ కానీ ఇవ్వనిదే పనులు జరగనివ్వబోమని తేల్చిచెప్పారు. వారి బెదిరింపులతో కాంట్రాక్టర్, పనులు చేసే కూలీలు బెదిరిపోయారు. కాగా.. తొలుత ప్రారంభించిన రూ.9 కోట్ల పనులకు సంబంధించి కాంట్రాక్టర్ సురేష్ నాయుడుకు రూ.2.50 లక్షల గుడ్‌విల్ ముట్టజెప్పినట్లు టీఎస్‌ఆర్ కంపెనీ సిబ్బంది తెలిపారు.