రాజీనామా యోచనలో కాటసాని
Published Thu, Aug 22 2013 2:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సమైక్యాంధ్ర ఉద్యమసెగలు ప్రజాప్రతినిధులను తాకుతున్నాయి. ఎమ్మెల్యే పదవులకు కాదు... పార్టీలకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ముందుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే స్పీకర్ ఫార్మెట్‌లో తన పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అవసరమైతే పార్టీని కూడా వీడాలన్న ఆలోచనతో ఉన్నారు. గురువారం నగరంలో భారీ ఎత్తున జరగనున్న ‘లక్ష గళ ఘోష’కు హాజరై తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించనున్నట్లు సమాచారం.
ఈ మేరకు మేధావులు, జేఏసీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన తర్వాత సీమాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తిరిగే పరిస్థితి కరువైంది. రాజీనామాలు చేసి వచ్చినట్లు చెబుతున్నా... ప్రజలు నమ్మని పరిస్థితి. ఉద్యమకారులకు మద్దతు తెలిపేందుకు వెళ్లినప్పుడు.. చర్చా వేదికల్లో పాల్గొన్నప్పుడు ఉద్యమకారుల నుంచి కాంగ్రెస్ నేతలకు తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. మరోవైపు వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సమైక్య సాధనకు పోరుబాట పట్టారు. ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగగా.. పాఠశాలలు, కళాశాలలు మూతబడి విద్యార్థులంతా రోడ్డెక్కారు. చివరికి గృహిణులు, బాలబాలికలు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. వీటన్నింటికన్నా... రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచే జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యమబాటలో ముందుండి సాగుతోంది.
సమన్యాయం పాటించకుండా విభజన చేస్తే ఆమోదించే ప్రసక్తే లేదని, ప్రతిరోజు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు గ్రామగ్రామాన ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గుంటూరులో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ మూడు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆమెకు సంఘీభావంగా మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్ రెడ్డి నిరవధిక దీక్షకు చేపట్టగా.. జిల్లా వ్యాప్తంగా దీక్షలు కొనసాగుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తం గా సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచిన ఏకైక పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అనే విషయం జనంలోకి వెళ్లినట్లు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భావిస్తున్నారు.
Advertisement
Advertisement