ఎమ్మెల్యే పాదయాత్ర | MLA padha yathra | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పాదయాత్ర

Published Thu, Feb 26 2015 2:47 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

MLA padha yathra

వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తన సోదరుడు  బుడ్డా శేషారెడ్డితో కలిసి బుధవారం సిద్ధాపురం చెరువు నుంచి వెలుగోడు రిజర్వాయర్ వరకు దాదాపు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో పది గ్రామాల ప్రజలు పాల్గొ
 న్నారు. ఉద్యమాలతో సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని సాధించి, రైతుల చిరకాల కోరికను నెరవేరుస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
 
 ఆత్మకూరు: ఉద్యమాలతో సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని సాధించి, రైతుల చిరకాల కోరికను నెరవేరుస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. ఈ పథకం పనులను పరిశీలించేందుకు తన సోదరుడు బుడ్డా శేషారెడ్డితో కలిసి బుధవారం సిద్ధాపురం చెరువు నుంచి వెలుగోడు రిజర్వాయర్ వరకు దాదాపు 18 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు.
 
 ఈ పాదయాత్రలో పది గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రకు విశేష స్పందన లభించిందని, వందల సంఖ్యలో రైతులు తన వెంట తరలివచ్చారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో  2006లో రూ. 80 కోట్లు నిధులను మంజూరు చేశారన్నారు. నల్లకాల్వ గ్రామం వద్ద ఈ పథకం మంజూరు చేస్తూ భూమిపూజ కూడా చేశారని గుర్తు చేశారు. అయితే వైఎస్సార్ మరణంతో ఎత్తిపోతల పథకం పనులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో రెండేళ్లలో పూర్తి కావాల్సిన ఈ పథకం నేటికి పూర్తి కాలేదన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో వందల క్యూసెక్కుల నీరు ఉన్నా రైతులు వినియోగించుకోలేని స్థితి దుస్థితిలో ఉన్నారని, ఇదంతా పాలకుల నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను మోసగించడమే లక్ష్యంగా ఎంచుకున్నారని విమర్శించారు.
 
 ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని హామినిచ్చి అధికారంలోకి వచ్చిన అనంతరం హామీని అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. మార్చి 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో సిద్ధాపురం ఎత్తిపోతల పథకం గురించి ప్రస్తావిస్తానన్నారు. ఎక్కడెక్కడ పనులు నిలిచిపోయాయి,  కారణాలు ఏమిటి, ఈ పథకం ఎలా పూర్తి చేయాలి, తదితర అన్ని విషయాలపై అసెంబ్లీలో మాట్లాడతానన్నారు. ఈ పథకం పూర్తి చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తునే ఉంటానని చెప్పారు.
 
  సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి  తన తండ్రి స్వర్గియ బుడ్డా వెంగళరెడ్డి, తన సోదరుడు స్వర్గీయ బుడ్డా సీతారామిరెడ్డిలు నిరంతర కృషి చేశారన్నారు. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడుపై ఈ పథకం ప్రారంభించాలని ఒత్తిడి చేసినట్లు గుర్తు చేశారు. ఈ పథకం పూర్తి చేసే వరకు అవసరమైతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి రైతులతో పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలు చేపడతానన్నారు. ఈ పథకాన్ని పూర్తి చేస్తే 13 గ్రామాలకు చెందిన 21 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పాదయాత్రలో మాజీ మార్కెట్‌యార్డు చెర్మైన్లు పాండురంగచౌదరి, తిరుపమయ్యలు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement