
ఎగసిన నిరసన
►అసెంబ్లీ వద్ద వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడంపై భగ్గుమన్న పార్టీ శ్రేణులు
►డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పాలభిషేకాలు, పలుచోట్ల ధర్నాలు
►నియోజకవర్గ కేంద్రాల్లో కదం తొక్కిన నాయకులు, కార్యకర్తలు
►అధికార పెత్తనాన్ని సహించబోమంటూ పాలకులకు హెచ్చరికలు
వైఎస్సార్ సీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాని అసెంబ్లీ వద్ద అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శనివారం గుంటూరులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
పట్నంబజారు (గుంటూరు) : అధికార పక్షం ఒంటెత్తు పోకడలతో ఇష్టానుసారం వ్యవహరించడంపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కన్నెర్రజేసింది. నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను అసెంబ్లీలోకి రానివ్వకుండా అడ్డుకోవడంపై పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. అధికార పెత్తనం చెలాయిస్తే సహించబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పాలభిషేకాలు నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
► పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియ జేశారు. అక్కడే ధర్నా చేశారు.
►పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో లాడ్జిసెంటర్ నుంచి శంకర్‌విలాస్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి నిరసన తెలియజేశారు.
►తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో నల్ల చొక్కాలు ధరించి రైల్వేస్టేషన్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
►వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
►తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త హెన్రి క్రిస్టినా, తాడికొండ, తుళ్లూరు, ఇన్‌చార్జి కత్తెర సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో మేడికొండూరు, ఫిరంగిపురంలలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
►పెదకూరపాడు నియోజకవర్గంలో సమన్వయకర్త పానెం హనిమిరెడ్డి ఆధ్వర్యంలో నల్ల కండువాలు ధరించి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ల రేవతి పాల్గొన్నారు.
► మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) కార్యాలయం నుంచి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు కార్యకర్తలు, నేతలు భారీ ప్రదర్శన నిర్వహించారు.
► మాచర్లలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు.
► పార్టీ లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులంతా లాడ్జిసెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు పాల్గొన్నారు.
►సత్తెనపల్లి నియోజకవర్గంలో పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్‌మీరా ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
► పొన్నూరులో పార్టీ జిల్లా అధికారప్రతినిధి గేరా సుబ్బయ్య ఆధ్వర్యంలో ఐలాండ్ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులుఅర్పించి ధర్నా నిర్వహించారు.
►వేమూరు నియోజకవర్గంలో ఆయా మండలాల నేతల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
►ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
గురజాల నియోజకవర్గంలో మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో నల్లరిబ్బన్లతో నిరసన తెలియజేసి అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
►బాపట్ల పట్టణంలో కోకి రాఘవరెడ్డి, నరాలశెట్టి ప్రకాష్‌రావుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
► రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం ఐలాండ్ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
► నరసరావుపేట నియోజకవర్గంలో పార్టీ నేతలు సుజాత పాల్, హనీఫ్‌లతోపాటు, మరికొంత మంది నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. క్షీరాభిషేకం నిర్వహించి నల్లరిబ్బన్లతో నిరసన తెలియజేశారు.