
ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలో మరో మాటా?
చంద్రబాబుపై ఎమ్మెల్యే ఆర్కే ఆగ్రహం
కెఎల్‌రావు కాలనీ (తాడేపల్లి రూరల్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట.. అధికారంలో ఉంటే మరో మాట మాట్లాడుతూ అబద్ధాల బాబుగా చరిత్రలో మిగిలిపోతారని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శనివారం కె.ఎల్.రావుకాలనీలో నివాసాలు కోల్పోతున్న బాధితులతో ఆయన సమావేశమయ్యారు. చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒక్కరి ఇల్లు తొలగించినా ఖబడ్దార్ అంటూ సవాలు చేశారని, ఇదే కె.ఎల్.రావుకాలనీలో గతంలో పాదయాత్ర నిర్వహిస్తూ ఈ మాటల న్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయనకు పేదలు కనిపించడం లేదని విమర్శించారు.
రెండు రోజుల క్రితం ఇక్కడ ఆగిన ముఖ్యమంత్రి కె.ఎల్.రావు కాలనీలోని ఇళ్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. అధికారులూ సర్వేలు చేపడుతున్నారని అన్నారు. ఆయన కుమారుడిని ఆజన్మ కుబేరుడిని చేయడానికే ఆయన ప్రయత్నమంతా అని ధ్వజమెత్తారు.
కాలనీవాసుల జోలికి వస్తే పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి, వైఎస్ చైర్మన్ దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి, తాడేపల్లి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్‌రాజు, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, కంచర్ల కాశయ్య, గుండిమెడ జేమ్స్, వైఎస్సార్‌సీపీ పట్టణ కార్యదర్శి ఎండీ గోరేబాబు, బీసీ సెల్ నాయకులు ఓలేటి రాము, మహిళా సంఘం నాయకురాలు సంపూర్ణ పార్వతి, యువజన నాయకులు మహేష్, ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్లు ముదిగొండ ప్రకాష్, బాలసాని అనిల్, కౌన్సిలర్లు కేళి వెంకటేశ్వరరావు, తమ్మా ధనలక్ష్మి, సింకా గంగాధర్, స్థానిక నేతలు తమ్మా వెంకటరెడ్డి, సుదర్శన్, మధు పాల్గొన్నారు.