సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్న తమ భూములను తిరిగి ఇవ్వాలంటూ ఉండవల్లికి చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ రైతులు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు. ముఖ్యమంత్రి పదవి పూర్తయిన తర్వాత తమ భూములు అప్పగిస్తామంటూ రహదారి నిర్మాణం కోసం రైతులు శేషగిరిరావు, దాసరి సాంబశివరావు నుంచి అధికారులు భూమిని తీసుకుని ఆ మేరకు 2015లో ఒప్పంద పత్రం రాసిచ్చారు. అయితే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడం, ప్రభుత్వం మారిన నేపథ్యంలో తమ భూములు ఇచ్చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి రైతులు ...ఆ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. తమది రాజన్న ప్రభుత్వమని....భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
10 అడుగులు కాస్తా... 23 అడుగులు
రైతు దాసరి సాంబశివరావు మాట్లాడుతూ...చంద్రబాబు సీఎం అయ్యాక... లింగమనేని గెస్ట్‌హౌస్‌ను తమ అధికారిక నివాసంగా చేసుకున్నారని, రోడ్డు నిర్మాణం కోసం తమ వద్ద నుంచి 10 అడుగుల భూమిని తీసుకుని, సీఎం శాశ్వాత నివాసం కట్టుకున్న తర్వాత షరతు ప్రకారం పొలంలో కలిపేస్తామంటూ ఈ మేరకు అప్పటి ఆర్డీవో, ఎమ్మార్వో, గ్రామ కార్యదర్శి సంతకం చేసి ఓ పత్రాన్ని ఇచ్చారన్నారు. అయితే పది అడుగులు కాస్తా 23 అడుగులు తీసుకున్నారని రైతు సాంబశివరావు తెలిపారు. ఇదేంటని ప్రశ్నించినా...అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు దిగిపోయారని, ఒప్పందం ప్రకారం తమ భూమి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ భూమి తిరిగిచ్చేయాలని... తాము సీఆర్డీయే అధికారులు, జిల్లా కలెక్టర్‌కు కూడా వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.
మరో రైతు బాలకోటయ్య మాట్లాడుతూ... తనకు లింగమనేని ఎస్టేట్ వద్ద 20 సెంట్లు భూమి ఉండేదని, ఆ భూమిలో లిల్లీలు, గులాబీలు పండించేవాడినని, అయితే సీఎం అధికారిక నివాసం వద్ద రోడ్డు నిర్మాణం కోసం ఆ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఆ భూమి ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆ భూమిని స్వాదీనం చేసుకోవచ్చని అధికారులు అగ్రిమెంట్‌లో పేర్కొన్నారని.. తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment