సాక్షి, నరసరావుపేట : ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ ర్యాలీ అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘రాజధానికి అమరావతి అనుకూలం కాదని 2014లోనే వైఎస్ జగన్ చెప్పారు. అమరావతి కట్టేటప్పుడు చంద్రబాబు ఎందుకు జోలె పట్టుకోలేదు. చంద్రబాబు బినామీలే అమరావతిలో ఆందోళనలు చేస్తున్నారు. ఆయన రైతులను రెచ్చగొడుతున్నారు. అయిదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కట్టలేదు. రాజధాని ముసుగులో వ్యాపారం చేసి వేలకోట్లు దోచుకున్నారు. చంద్రబాబు రాజధానిని గ్రాఫిక్స్‌లో చూపించారు. రైతు పక్షపాతి సీఎం వైఎస్ జగన్’ అని అన్నారు.
విశాఖ బ్రహ్మాండమైన నగరం అన్నారుగా?
నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.... విశాఖ బ్రహ్మాండమైన నగరమని గతంలో చంద్రబాబే చెప్పారని గుర్తు చేశారు. విశాఖను దేశంలోనే రెండో ఆర్థిక రాజధానిగా అభివృద్థి చేస్తామన్నారని, ఇప్పుడు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే అడ్డుపడుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు వయసు పెరిగిన బుద్ధి మారలేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. ఆయనకు అధికారం, డబ్బుయావ తప్ప ప్రజల గురించి పట్టదని అన్నారు. చంద్రబాబు ఎందుకు జోలె పట్టి డబ్బులు అడుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు.
సీఎం జగన్ రైతుల పక్షపాతి..
అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే సమగ్రాభివృద్ధి జరుగుతుందని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని అన్నారు. చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే కుదరదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి గురించి అనుక్షణం ఆలోచిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని విడదల రజని తెలిపారు. రైతులకు న్యాయం చేసేందుకు జగనన్న ఎప్పుడు ముందే ఉంటారన్నారు. చంద్రబాబు మాయలో ఎవరూ పడొద్దని, గ్రామ సచివాలయం ఆ గ్రామానికి రాజధానే అని అన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, స్వార్థం కోసం చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టకూడదని హితవు పలికారు.
ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు
వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ... ‘పల్నాడు అభివృద్ధి చంద్రబాబుకు ఇష్టం లేదు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఆయన చెడగొడుతున్నారు. కలు, మతాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. సీఎం జగన్ బ్రహ్మాండమైన పాలన అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి’ అని అన్నారు.
చంద్రబాబు పాపాలు...అమరావతికి శాపాలు
చంద్రబాబు పదవిలో ఉన్నంతకాలం ఆర్భాటాలు చేశారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ధ్వజమెత్తారు. అమరావతిని భ్రమరావతిని చేసింది ఆయనే అని, గ్రాఫిక్స్‌తో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. అమరావతిలో బినామీ భూములపై చంద్రబాబుకు బెంగ పట్టుకుందని, రైతుల ముసుగులో ఆందోళన చేస్తుంది బాబు బినామీలేనని ఆరోపించారు. చంద్రబాబు దళిత ద్రోహి అని ఎమ్మెల్యే శ్రీదేవి నిప్పులు చెరిగారు. అమాయక రైతుల భూములు బినామీలకు అప్పచెప్పారని అన్నారు. చంద్రబాబు పాపాలు...అమరావతికి శాపాలు అని ఆమె వ్యాఖ్యానించారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment