Undavalli farmers
-
ముందు ప్యాకేజీ తేల్చండి
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడేపల్లి రూరల్: అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం రైతులతో సీఆర్డీఏ ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులు, ఇతర రైతుల మధ్య వివాదం చెలరేగడంతో సమావేశం వాయిదా పడింది. భూసేకరణకు ప్యాకేజీ ఎంత ఇస్తారో తే ల్చిన తర్వాతే ముందుకు వెళ్లాలని రైతులు కరాఖండిగా చెప్పడంతో సీఆర్డీఏ అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం భూ సేకరణకు నోటీసులు ఇవ్వగా భూములు కోల్పోయే రైతులు హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకువచ్చారు. దీంతో రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో సీడ్ యాక్సెస్ రోడ్లు నిర్మాణానికి సీఆర్డీఏ సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగా శనివారం ఉండవల్లి సచివాలయం–2లో రోడ్డు నిర్మాణంలో పొలాలు కోల్పోయే రైతులతో సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ఆరంభంలోనే రైతులు సీఆర్డీఏ అధికారులను నిలదీశారు. ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ముందుగా ఎందుకు తెలియజేయలేదని, ఒక్క పేపరు ప్రకటన ఇస్తే సరిపోతుందా అంటూ నిలదీశారు. ముందుగానే సమాచారం ఇచ్చామని డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వరనాయుడు చెప్పారు. రోడ్డు కోసం రైతుల భూములను సర్వే చేస్తామని, అనంతరం మరోసారి సమావేశం ఏర్పాటు చేసి మిగిలిన విషయాలు మాట్లాడుకుందామని ఆయన చెబుతుండగా రైతులు తిరగబడ్డారు. సర్వే కాదని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రైతులకు ఎంత ప్రకటిస్తారో ముందుగా చెప్పాలని డిమాండ్ చేశారు. అంతలో అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ రైతు సంఘం నాయకుడు దాసరి కృష్ణ కల్పించుకొని, మనకు రాజధాని వద్దు, మన భూములు ఇవ్వవద్దు.. గత ప్రభుత్వంలో రైతులకు కౌలు కూడా ఇవ్వనప్పుడు ఎవరూ మాట్లాడలేదంటూ వాగ్వాదానికి దిగారు. దాంతో మిగతా రైతులు ఆయనపై తిరగబడ్డారు. గత ప్రభుత్వంలో కరకట్ట విస్తరణకు భూ సేకరణ నోటీసు ఇస్తే దానిని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించామని, సీడ్ యాక్సెస్ రోడ్డు, కరకట్ట విస్తరణ రెండింటి మీదా హైకోర్టు స్టే ఇచ్చిందని, మాకు ఏ ప్రభుత్వమైనా ఒకటేనని, రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుంటూరు – విజయవాడ మహా నగరాల మధ్య ఉన్న వారికి, ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నవారికి ఒకే ప్యాకేజీ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని రైతులు ప్రశ్నించారు. ఈ క్రమంలో తెలుగుదేశం రైతు సంఘం నాయకులు, ఇతర రైతుల మధ్య వివాదం చెలరేగింది. పలువురు రైతులు మాట్లాడుతూ తాము నష్టపోవడానికి సిద్ధంగా లేమని, సీఎం చంద్రబాబు, మంగళగిరి ఎమ్మెల్యే లోకేశ్‌తో సమావేశం ఏర్పాటు చేస్తే మా కష్టాలు తెలుపుతామని అన్నారు. మళ్లీ టీడీపీ రైతు సంఘం నాయకులు కల్పించుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో సీఆర్డీఏ అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు. తదుపరి సమావేశానికి సీడ్ యాక్సెస్ రోడ్డులో భూములు కోల్పోయే రైతులు మాత్రమే హాజరు కావాలని డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వరనాయుడు స్పష్టం చేశారు. -
నోటీసులపై స్పందించని లింగమనేని ఎక్కడున్నారు
-
లింగమనేని ఎక్కడున్నారు? : ఆర్కే
సాక్షి, అమరావతి : నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గెస్ట్ హౌస్‌కు నోటీసులు ఇస్తే లింగమనేని రమేశ్ ఎందుకు స్పందించటం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించాడు. లింగమనేని గెస్ట్ హౌస్‌కు నోటీసులు ఇస్తే.. పచ్చ మీడియా, టీడీపీ నేతలు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు రాద్ధాంతం చేయడంపై మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలంటూ ఆర్కేను ఆశ్రయించారు. ముఖ్యమంత్రి పదవి పూర్తయిన తర్వాత తమ భూములు అప్పగిస్తామంటూ రహదారి నిర్మాణం కోసం రైతులు శేషగిరిరావు, దాసరి సాంబశివరావు నుంచి అధికారులు భూమిని తీసుకుని ఆ మేరకు 2015లో ఒప్పంద పత్రం రాసిచ్చారు. అయితే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడం, ప్రభుత్వం మారిన నేపథ్యంలో తమ భూములు ఇచ్చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రైతులతో కలిసి ఆర్కే ఆ భూములను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కట్టడంపై ఇచ్చిన నోటీసులపై స్పందించని లింగమనేని ఎక్కడున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటికి రోడ్డు పేరుతో అప్పటి ప్రభుత్వం రైతులను బెదిరించి భూములను తీసుకుందని విమర్శించారు. కేవలం 10 అడుగులు మాత్రమేనని చెప్పి ఒక్కొక్కరి నుంచి 20 సెంట్ల భూమిని కబ్జా చేశారని మండిపడ్డారు. భూమిని లాక్కోవడమే కాకుండా నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని తెలిపారు. రైతులకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని స్పష్టం చేశారు. భూమిని రైతులకు తిరిగి ఇస్తామని అన్నారు. -
మా భూములు తిరిగిచ్చేయండి చంద్రబాబు..
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్న తమ భూములను తిరిగి ఇవ్వాలంటూ ఉండవల్లికి చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ రైతులు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు. ముఖ్యమంత్రి పదవి పూర్తయిన తర్వాత తమ భూములు అప్పగిస్తామంటూ రహదారి నిర్మాణం కోసం రైతులు శేషగిరిరావు, దాసరి సాంబశివరావు నుంచి అధికారులు భూమిని తీసుకుని ఆ మేరకు 2015లో ఒప్పంద పత్రం రాసిచ్చారు. అయితే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడం, ప్రభుత్వం మారిన నేపథ్యంలో తమ భూములు ఇచ్చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి రైతులు ...ఆ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. తమది రాజన్న ప్రభుత్వమని....భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. 10 అడుగులు కాస్తా... 23 అడుగులు రైతు దాసరి సాంబశివరావు మాట్లాడుతూ...చంద్రబాబు సీఎం అయ్యాక... లింగమనేని గెస్ట్‌హౌస్‌ను తమ అధికారిక నివాసంగా చేసుకున్నారని, రోడ్డు నిర్మాణం కోసం తమ వద్ద నుంచి 10 అడుగుల భూమిని తీసుకుని, సీఎం శాశ్వాత నివాసం కట్టుకున్న తర్వాత షరతు ప్రకారం పొలంలో కలిపేస్తామంటూ ఈ మేరకు అప్పటి ఆర్డీవో, ఎమ్మార్వో, గ్రామ కార్యదర్శి సంతకం చేసి ఓ పత్రాన్ని ఇచ్చారన్నారు. అయితే పది అడుగులు కాస్తా 23 అడుగులు తీసుకున్నారని రైతు సాంబశివరావు తెలిపారు. ఇదేంటని ప్రశ్నించినా...అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు దిగిపోయారని, ఒప్పందం ప్రకారం తమ భూమి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ భూమి తిరిగిచ్చేయాలని... తాము సీఆర్డీయే అధికారులు, జిల్లా కలెక్టర్‌కు కూడా వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. మరో రైతు బాలకోటయ్య మాట్లాడుతూ... తనకు లింగమనేని ఎస్టేట్ వద్ద 20 సెంట్లు భూమి ఉండేదని, ఆ భూమిలో లిల్లీలు, గులాబీలు పండించేవాడినని, అయితే సీఎం అధికారిక నివాసం వద్ద రోడ్డు నిర్మాణం కోసం ఆ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఆ భూమి ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆ భూమిని స్వాదీనం చేసుకోవచ్చని అధికారులు అగ్రిమెంట్లో పేర్కొన్నారని.. తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. -
తాడేపల్లి నుంచి రైతుల భారీ ర్యాలీ
సాక్షి, అమరావతి : ఓ వైపు రైతుల పొట్ట కొడుతూ... మరోవైపు పరిశ్రమల పేరుతో అస్మదీయులకు విలువైన భూములను కారుచౌకగా కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై వైఖరిపై రైతన్నలు భగ్గుమంటున్నారు. సన్న, చిన్నకారు రైతుల పొట్టకొట్టి భూములను బడా నేతలకు కేటాయించాలని చూస్తోందంటూ మండిపడుతున్నారు. ఈ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ పలు గ్రామాల రైతులు సోమవారం తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లి, కుంచెనపల్లి, కొలనుకొండ గ్రామాల్లోని భూములపై ప్రభుత్వం విధించిన U-1 రిజర్వ్ జోన్ తొలగించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాగా కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సంబంధించిన కంపెనీకి దాదాపు 7 ఎకరాల భూమి కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి భార్య వెంకాయమ్మ డైరెక్టర్‌గా ఉన్న గుంటూరు టక్స్‌టైల్ పార్క్ లిమిటెడ్‌కు గుంటూరు జిల్లా చిలకలూరి పేట మండలం గోపాలవారిపాలెంలో 6.96 ఎకరాలను కేటాయించిన విషయం తెలిసిందే. -
చంద్రబాబు నివాసం వరకూ రైతుల ర్యాలీ
-
రైతుల గుండెల్లో హైటెన్షన్
తాడేపల్లిరూరల్: రాజధాని పరిధిలోని ఉండవల్లి రైతుల గుండెల్లో మళ్లీ హైటెన్షన్ పట్టుకుంది. బుధవారం తెల్లవారుజామునే హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిబ్బంది గ్రామానికి వచ్చారు. ఇప్పటికే తమకున్న అతి తక్కువ స్థలంలో స్తంభాలు ఏర్పాటు చేస్తే ఎలా బతకాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వెనకడుగు వేసిన అధికారులు మళ్లీ హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమయ్యారు. దీంతో రైతులు మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఆయన నివాసంలో కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే ఆర్కే సంఘటన స్థలానికి వచ్చి పనులు చేస్తున్న సిబ్బందిని ఆపాలని సూచించారు. అనంతరం ఇరిగేషన్ డీఈతోను, మెగా కన్స్ట్రక్షన్ మేనేజర్‌తోనూ ఆయన ఫోన్లో సంప్రదించారు. వెంటనే వారు సంఘటన స్థలానికి వచ్చారు. రైతుల అభిప్రాయం మేరకు మరో స్తంభం ఏర్పాటు చేయాలని ఆర్కే సూచించారు. ఇరిగేషన్ కొండవీటి వాగు ఎత్తుపోతల పథకం కాంట్రాక్టర్లు.. ఆ పని విద్యుత్ శాఖకు సంబంధించిందని తెలిపారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్లో సంప్రదించి రైతుల బాధను అర్థం చేసుకోవాలని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే అక్కడ నుంచి వెళ్లిపోవడంతో 2 గంటల అనంతరం పోలీసు బలగాలతో సంఘటన స్థలానికి వచ్చి హైటెన్షన్ వైర్లు లాగేందుకు ప్రయత్నించడంతో రైతులు అడ్డుకున్నారు. విద్యుత్ శాఖ సిబ్బందికి, రైతులకు మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులను పిలిపించి బలవంతంగా వైర్లు లాగేందుకు ప్రయత్నం చేయగా.. మేం చావడానికైనా సిద్ధమంటూ రైతులు తేల్చి చెప్పారు. సంఘటన స్థలానికి తహసీల్దార్ వచ్చి, వైర్లు లాగాల్సిందేనన్నారు. రూ.5 లక్షలు ఖర్చు పెడితే 11 మంది రైతు కుటుంబాలను కాపాడిన వారవుతారంటూ స్థానికులు కోరారు. పనులను అడ్డుకుంటే కేసు పెడతామని ఎమ్మార్వో హెచ్చరించారు. తమకు ఉన్న 10, 20 సెంట్లలో హైటెన్షన్ వైర్లు లాగితే మా జీవితాలు ఏం కావాలని రైతులు మండిపడ్డారు. గజాల్లో ఉన్న స్థలాల్లో మీరు ఎలా హైటెన్షన్ వైర్లు లాగుతారని ప్రశ్నించారు. చివరకు అన్ని శాఖల అధికారులు ఒకరికొకరు మాట్లాడుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రత్యామ్నాయం ఉండగా రైతులను వేధిస్తున్న వైనం ఇరిగేషన్, రెవెన్యూ, ఎలక్ట్రికల్ అధికారులు ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ రైతులను వేధిస్తున్నారు. ఏర్పాటు చేసిన హైటెన్షన్ స్తంభాలకు మరో 100 గజాల దూరంలో మరో స్తంభం ఏర్పాటు చేస్తే రైతుల భూములు 5, 6 సెంట్లు మాత్రమే పోతుంది. అవి ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎలక్ట్రికల్ అధికారులు కొంత అదనంగా ఖర్చు పెడితే రైతుల పొలాలను మినహాయించి వైర్లు ఏర్పాటు చేయవచ్చు. కానీ కాంట్రాక్టరుకు లబ్ధి చేకూర్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తూ, రైతుల పొలాల్లోంచి తీగలు లాగుతున్నారు. దానికి టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయంటూ కుంటిసాకు చెబుతూ అన్నదాతలను భయాందోళనకు గురి చేస్తున్నారు. -
ప్రజాభిప్రాయ సేకరణ ఇలాగేనా?
అమరావతి: బలవంతంగా తమ భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని సీఆర్డీఏ అధికారులకు ఉండవల్లి రైతులు తెగేసి చెప్పారు. బారికేడ్లు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారా అని ప్రశ్నించారు. ఉండవల్లిలో భూసేకరణపై ఆదివారం ఉండవల్లిలో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు దాటి ముందుకు వస్తే వారిపై చర్య తీసుకునే విధంగా పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు. భూములు ఇవ్వని రైతులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అధికారుల తీరుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు పెట్టి ప్రజాభిప్రాయం సేకరించడంపై మండిపడ్డారు. అధికారుల వ్యవహరించిన తీరుకు నిరసనగా సభ నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు, కుతంత్రాలు చేసినా తమకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామని రాజధాని ప్రాంత రైతులు అంటున్నారు. -
మింగడానికి మెతుకు లేదుగాని....
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం... అందుకు భూముల సేకరణపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై గుంటూరు జిల్లాలోని ఉండవల్లి, పినమాక, నిడమర్రు గ్రామాల్లోని రైతులు నిప్పులు చెరిగారు. గురువారం వైఎస్ఆర్ సీపీ రైతు పరిరక్షణ కమిటీ సదరు గ్రామాలలో పర్యటిస్తూ... పొలాలను సందర్శిస్తూ.... రైతులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు బాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని కోసం తమ భూములు తీసుకుని సింగపూర్ చేస్తానంటున్న చంద్రబాబు వైఖరి చూడబోతే మింగడానికి మెతుకు లేదుగాని మీసాలకు సంపెంగ నూనె రాసినట్లుగా ఉందని వారు ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం కోసం వాడెవడికో ఎకరాలకు ఎకరాలు ఇస్తాడంటా.... తమ భూములు తీసుకుని ప్రత్యామ్నాయంగా గజం స్థలం కూడా ఇవ్వడం లేదని వారు బాబు వైఖరిని తుర్పారబెట్టారు. రాజధానిని నిర్మించే ప్రాంతానికి సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఇస్తే చాలు అంతకన్నా ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు. పదేపదే బాబు సింగపూర్‌లా నిర్మాస్తామంటున్నారు.... అంటే సింగపూర్, మలేషియా వాళ్లు బాగా పరిపాలించుకునేవాళ్లు... మనం మాత్రం చేతగానివాళ్లమా అని ప్రశ్నించారు. రాజధానికి భూములు ఇవ్వబోమని ఉండవల్లి రైతులు వైఎస్ఆర్ సీపీ కమిటీ సభ్యుల ఎదుట స్పష్టం చేశారు. ఆ క్రమంలో తాము చేసే పోరాటంలో కలసి రావాలని వారు కమిటీ సభ్యులకు కోరారు. దేశంలో ఎక్కడా లేని సౌకర్యాలన్నీ... తమ ప్రాంతాలో ఉన్నాయని వారు గుర్తు చేశారు. ఈ విషయంలో మనం చైనాను మనం నేర్చుకోవాలన్నారు. పేద రైతుల నుంచి భూములు తీసుకుని ... అదీ ఇదీ చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. రాజధానిని నిర్మించే ముందు నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలని రైతులు చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సరైన అధ్యయనం, ప్రణాళిక లేకుండా చంద్రబాబు రాజధానిని ఏర్పాటు చేస్తామంటున్నారని విమర్శించారు. ప్రతి అంశంలోనూ చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం విషయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా రైతులు, నాయకులను పిలిచి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారా అని ప్రశ్నించారు. కృష్ణానది ఒడ్డున సారవంతమైన భూములు ఉన్నాయి... వాటిని రాజధాని పేరుతో తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కోసం మొదట 30 వేలు ఎకరాలు ... ఆ తర్వాత 60 వేల ఎకరాలు... ఇప్పుడు లక్షన్నర ఎకరాలు అంటున్నారని తీవ్ర ఆందోళనతో వెల్లడించారు. ఇంత భూమి తీసుకుని రాజధానిని ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా కట్టారా ? అని ప్రశ్నించారు. తమ భూముల్లో సంవత్సరానికి మూడు పంటలు పండుతున్నాయి... ఈ భూముల ఆధారంగా చేసుకుని వ్యవసాయ కార్మికులు, కూలీలు బతుకుతున్నారని రైతులు గుర్తు చేశారు.అలాంటి భూములు ఇస్తే మా జీవితాలకు భద్రత కోల్పోతామని వారు తీవ్ర కలత చెందారు. రాజధాని నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని రాకముందే... ఇక్కడ భూములకు విపరీతమైన ధర పలికిందని తెలిపారు. కానీ ఆ సమయంలోనే తాము భూములు విక్రయించలేదని ఉండవల్లి రైతులు వైఎస్ఆర్ సీపీ పరిరక్షణ కమిటీ ఎదుట తమ గోడు వెల్లబుచ్చారు.