ప్రభుత్వాన్ని నిలదీసిన ఉండవల్లి రైతులు
సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం ఏర్పాటు చేసిన సమావేశం రసాభాస
ముందు సర్వే చేద్దామన్న అధికారులు.. ససేమిరా అన్న రైతులు
టీడీపీ రైతు సంఘం నేతలు, రైతుల మధ్య ఘర్షణ
ప్రభుత్వం ఏదైనా నష్టం జరిగితే ఊరుకోబోమని రైతుల స్పష్టీకరణ
సమావేశాన్ని వాయిదా వేసిన సీఆర్‌డీఏ
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడేపల్లి రూరల్: అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం రైతులతో సీఆర్‌డీఏ ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులు, ఇతర రైతుల మధ్య వివాదం చెలరేగడంతో సమావేశం వాయిదా పడింది. భూసేకరణకు ప్యాకేజీ ఎంత ఇస్తారో తే ల్చిన తర్వాతే ముందుకు వెళ్లాలని రైతులు కరాఖండిగా చెప్పడంతో సీఆర్‌డీఏ అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం భూ సేకరణకు నోటీసులు ఇవ్వగా భూములు కోల్పోయే రైతులు హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకువచ్చారు. దీంతో రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో సీడ్ యాక్సెస్ రోడ్లు నిర్మాణానికి సీఆర్‌డీఏ సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగా శనివారం ఉండవల్లి సచివాలయం–2లో రోడ్డు నిర్మాణంలో పొలాలు కోల్పోయే రైతులతో సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ఆరంభంలోనే రైతులు సీఆర్‌డీఏ అధికారులను నిలదీశారు.
ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ముందుగా ఎందుకు తెలియజేయలేదని, ఒక్క పేపరు ప్రకటన ఇస్తే సరిపోతుందా అంటూ నిలదీశారు. ముందుగానే సమాచారం ఇచ్చామని డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వరనాయుడు చెప్పారు. రోడ్డు కోసం రైతుల భూములను సర్వే చేస్తామని, అనంతరం మరోసారి సమావేశం ఏర్పాటు చేసి మిగిలిన విషయాలు మాట్లాడుకుందామని ఆయన చెబుతుండగా రైతులు తిరగబడ్డారు. సర్వే కాదని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రైతులకు ఎంత ప్రకటిస్తారో ముందుగా చెప్పాలని డిమాండ్ చేశారు.
అంతలో అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ రైతు సంఘం నాయకుడు దాసరి కృష్ణ కల్పించుకొని, మనకు రాజధాని వద్దు, మన భూములు ఇవ్వవద్దు.. గత ప్రభుత్వంలో రైతులకు కౌలు కూడా ఇవ్వనప్పుడు ఎవరూ మాట్లాడలేదంటూ వాగ్వాదానికి దిగారు. దాంతో మిగతా రైతులు ఆయనపై తిరగబడ్డారు. గత ప్రభుత్వంలో కరకట్ట విస్తరణకు భూ సేకరణ నోటీసు ఇస్తే దానిని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించామని, సీడ్ యాక్సెస్ రోడ్డు, కరకట్ట విస్తరణ రెండింటి మీదా హైకోర్టు స్టే ఇచ్చిందని, మాకు ఏ ప్రభుత్వమైనా ఒకటేనని, రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గుంటూరు – విజయవాడ మహా నగరాల మధ్య ఉన్న వారికి, ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నవారికి ఒకే ప్యాకేజీ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని రైతులు ప్రశ్నించారు. ఈ క్రమంలో తెలుగుదేశం రైతు సంఘం నాయకులు, ఇతర రైతుల మధ్య వివాదం చెలరేగింది. పలువురు రైతులు మాట్లాడుతూ తాము నష్టపోవడానికి సిద్ధంగా లేమని, సీఎం చంద్రబాబు, మంగళగిరి ఎమ్మెల్యే లోకేశ్‌తో సమావేశం ఏర్పాటు చేస్తే మా కష్టాలు తెలుపుతామని అన్నారు.
మళ్లీ టీడీపీ రైతు సంఘం నాయకులు కల్పించుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో సీఆర్‌డీఏ అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు. తదుపరి సమావేశానికి సీడ్ యాక్సెస్ రోడ్డులో భూములు కోల్పోయే రైతులు మాత్రమే హాజరు కావాలని డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వరనాయుడు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment