మింగడానికి మెతుకు లేదుగాని.... | Undavalli farmers takes on chandrababu due to new capital city | Sakshi
Sakshi News home page

మింగడానికి మెతుకు లేదుగాని....

Published Thu, Nov 13 2014 4:44 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

మింగడానికి మెతుకు లేదుగాని.... - Sakshi

మింగడానికి మెతుకు లేదుగాని....

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం... అందుకు భూముల సేకరణపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై గుంటూరు జిల్లాలోని ఉండవల్లి, పినమాక, నిడమర్రు గ్రామాల్లోని రైతులు నిప్పులు చెరిగారు.  గురువారం వైఎస్ఆర్ సీపీ రైతు పరిరక్షణ కమిటీ సదరు గ్రామాలలో పర్యటిస్తూ... పొలాలను  సందర్శిస్తూ.... రైతులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు బాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని కోసం తమ భూములు తీసుకుని సింగపూర్ చేస్తానంటున్న చంద్రబాబు వైఖరి చూడబోతే మింగడానికి మెతుకు లేదుగాని మీసాలకు సంపెంగ నూనె రాసినట్లుగా ఉందని వారు ఎద్దేవా చేశారు.
 
రాజధాని నిర్మాణం కోసం వాడెవడికో ఎకరాలకు ఎకరాలు ఇస్తాడంటా.... తమ భూములు తీసుకుని ప్రత్యామ్నాయంగా గజం స్థలం కూడా ఇవ్వడం లేదని వారు బాబు వైఖరిని తుర్పారబెట్టారు. రాజధానిని నిర్మించే ప్రాంతానికి సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఇస్తే చాలు అంతకన్నా ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు. పదేపదే బాబు సింగపూర్లా నిర్మాస్తామంటున్నారు.... అంటే సింగపూర్, మలేషియా వాళ్లు బాగా పరిపాలించుకునేవాళ్లు... మనం మాత్రం చేతగానివాళ్లమా అని ప్రశ్నించారు.

రాజధానికి భూములు ఇవ్వబోమని ఉండవల్లి రైతులు వైఎస్ఆర్ సీపీ కమిటీ సభ్యుల ఎదుట స్పష్టం చేశారు. ఆ క్రమంలో తాము చేసే పోరాటంలో కలసి రావాలని వారు కమిటీ సభ్యులకు కోరారు. దేశంలో ఎక్కడా లేని సౌకర్యాలన్నీ... తమ ప్రాంతాలో ఉన్నాయని వారు గుర్తు చేశారు. ఈ విషయంలో మనం చైనాను మనం నేర్చుకోవాలన్నారు. పేద రైతుల నుంచి భూములు తీసుకుని ... అదీ ఇదీ చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు.

రాజధానిని నిర్మించే ముందు నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలని రైతులు చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సరైన అధ్యయనం, ప్రణాళిక లేకుండా చంద్రబాబు రాజధానిని ఏర్పాటు చేస్తామంటున్నారని విమర్శించారు. ప్రతి అంశంలోనూ చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం విషయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా రైతులు, నాయకులను పిలిచి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారా అని ప్రశ్నించారు.  

కృష్ణానది ఒడ్డున సారవంతమైన భూములు ఉన్నాయి... వాటిని రాజధాని పేరుతో తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కోసం మొదట 30 వేలు ఎకరాలు ... ఆ తర్వాత 60 వేల ఎకరాలు... ఇప్పుడు లక్షన్నర ఎకరాలు అంటున్నారని తీవ్ర ఆందోళనతో వెల్లడించారు. ఇంత భూమి తీసుకుని రాజధానిని ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా కట్టారా ? అని ప్రశ్నించారు. తమ భూముల్లో సంవత్సరానికి మూడు పంటలు పండుతున్నాయి... ఈ భూముల ఆధారంగా చేసుకుని వ్యవసాయ కార్మికులు, కూలీలు బతుకుతున్నారని రైతులు గుర్తు చేశారు.అలాంటి భూములు ఇస్తే మా జీవితాలకు భద్రత కోల్పోతామని వారు తీవ్ర కలత చెందారు. రాజధాని నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని రాకముందే... ఇక్కడ భూములకు విపరీతమైన ధర పలికిందని తెలిపారు. కానీ ఆ సమయంలోనే తాము భూములు విక్రయించలేదని ఉండవల్లి రైతులు వైఎస్ఆర్ సీపీ పరిరక్షణ కమిటీ ఎదుట తమ గోడు వెల్లబుచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement