ప్రభుత్వం చెప్పేది చెవిలో పూలు పెట్టుకుని వినాలా ?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై చంద్రబాబు ప్రభుత్వానికి స్పష్టత లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ప్రభుత్వానికే స్పష్టత లేకుంటే రైతులు భూములు ఎందుకిస్తారని ఆమె ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లో సాక్షి హెడ్లైన్ షోలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... రాజధాని నిర్మాణం విషయంలో ప్రతిపక్షాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏం చెబితే అది చెవిలో పూలు పెట్టుకుని వినాలా అని ప్రభుత్వాన్ని వాసిరెడ్డి పద్మ మరోసారి ప్రశ్నించారు. ల్యాండ్ మాఫియాకు ప్రభుత్వం ఆశీస్సులున్నాయని ఆమె తెలిపారు.
రాజధాని ఏర్పాటుపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సూచనలను అసలు పరిగణలోకి తీసుకోవడం లేదని ఆమె గుర్తు చేశారు. ఆ కమిటీ ఈ అంశంపై చర్చ జరపాలని సూచించిందని.... ఆ విషయాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం విస్మరించారని ఆమె విమర్శించారు. అయితే ఈ షోకు హాజరైన టీడీపీ నేత విజయలక్ష్మీ మాట్లాడుతూ... రాజధాని ఏర్పాటుకు తమ భూమిని ఇచ్చేందుకు 80 శాతం మంది రైతులు సానుకూలంగా ఉన్నారని చెప్పారు.
రైతులు అనుమతితోనే భూసమీకరణ చేపట్టినట్లు ఆమె తెలిపారు. అలాగే రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో రియల్ దందా చేస్తుందని అద్దంకి దయాకర్ ఆరోపించారు.