చంద్రబాబు తీరుతో మద్యాంధ్రప్రదేశ్
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ తాగునీటి సరఫరాపై లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లకు ప్రజాధనం దోచిపెట్టడం, ప్రజలను మద్యానికి బానిసలను చేయడమే చంద్రబాబు విజన్ అని మండిపడ్డారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘బెల్ట్‌షాపులు పెట్టండి. మద్యం అమ్మకాలు పెంచండి. ప్రజల చేత ఎంతైనా తాగించండి. మాకు వాటా ఇవ్వండి’’ అని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోందని దుయ్యబట్టారు. బెల్ట్ షాపులు తెరిచి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తోందని ఆరోపించారు.
ఆ కుటుంబాలను సర్వనాశనం చేస్తారా? : ‘‘ రాష్ట్రంలో మద్యానికి బానిసలైన కుటుంబాలను మరింతగా సర్వనాశనం చేయడానికే చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ప్రభుత్వ పెద్దలు చెబుతున్నట్లు రాష్ట్రంలో 12.5 శాతం అభివృద్ధి ఉంటే మద్యం అమ్మకాలపై ఆధారపడటం ఎందుకు? అధికార పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయింది. రెండున్నరేళ్ల పాలనలో ఏం సాధించారో టీడీపీ ప్రారంభించబోయే జనచైతన్య యాత్రల్లో ప్రజలకు చెప్పాలి. విభజన చట్టంలోని హామీలను కూడా రాబట్టలేని అధికార పార్టీ చైతన్య యాత్రలు చేపట్టడం విడ్డూరంగా ఉంది’’ అని వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు.