సాక్షి, అమరావతి : కరోనా వైరస్ దెబ్బతో భారత్ సహా ప్రపంచ దేశాలు గజ గజ వణికిపోతున్నాయి. కరోనా కట్టడికి భారత్ లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. సామాన్యులు మొదలు సెలబ్రిటీలు, క్రీడాకారులు మొదలు రాజకీయ నాయకుల వరకు అంతా ఇంట్లోనే గడుపుతున్నారు. ఇన్నాళ్లూ రాజకీయాలతో బిజీ, బిజీగా ఉండే రాజకీయ నేతలు ఇంట్లోనే టైంపాస్ చేస్తున్నారు. పుస్తకాలు చదవడం.. చిన్న పిల్లలు ఉంటే వారితో గడపడం ఇలా కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. వంటింట్లో గరిటె తిప్పుతూ తన కుకింగ్ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు.
రోజుకో స్పెషల్ వంటకం చేస్తూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. తాజాగా తన పిల్లలకు ఇష్టమైన ఫిష్ ఫ్రై, టమాట, క్యారెట్ కూరలను తయారు చేశారు. కరోనా వచ్చిందన్న బాధ ఉన్నప్పటికీ సరదాగా కుటుంబ సభ్యులతో గడపడం సంతోషంగా ఉందంటున్నారు రోజా. ప్రస్తుతం రోజా చేసిన వంట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కాగా, ఒక వైపు కుటుంబం కోసం సమయం కేటాయిస్తూనే.. లాక్‌డౌన్ వేళ రోజా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు, వైద్య సిబ్బందికి రోజూ భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.
కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి
గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయకుండానే రాష్ట్రాన్ని మూడున్నర లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచేశారని నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇంటింటికి రూ.1000 పంపిణీ చేసి సీఎం జగన్ మనసున్న నాయకుడని మరోసారి నిరూపించుకున్నారని ప్రశంసించారు. ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఇంటింటింకి రేషన్ పంపిణీ జరిగిందన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పూర్తిగా కష్టాల పాలు చేశారని విమర్శించారు. కరోనా కట్టడికి ప్రజలు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment