సాక్షి, అమరావతి : రాజధాని విషయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలోనూ మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించే కార్యక్రమాల్లో బీసీలందరూ పాల్గొనాలని పిలుపినిచ్చారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం జగన్ ఒక సముచిత, చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రశంసించారు. మూడు రాజధానులు అనగానే చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని బడుగు బలహీన వర్గాలు స్వాగతిస్తున్నాయన్నారు. (బాబుతో ప్రతాప్ కలిసి పనిచేశారు: జంగా)
రాజధాని ఎక్కడికి పోవడం లేదని, శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని తెలిపారు. ప్రజల్ని తికమక పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, రాజధానికి 53 వేల ఎకరాల భూమి అవసరమా అని ప్రశ్నించారు. 53 వేల ఎకరాలు తీసుకుని చంద్రబాబు అమరావతిలో గ్రాఫిక్స్ చూపారని, అమరావతిని బ్రమరావతిగా మార్చారని మండిపడ్డారు. చంద్రబాబు లెక్కల ప్రకారం అమరావతి నిర్మించాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందని ప్రశ్నించారు. ఒకే చోట రాజధాని వల్ల ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి నడుస్తున్నారని, జరుగుతున్న సంక్షేమ పథకాలపై చంద్రబాబుఅక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలు ఆపి రాజధాని చేపట్టాలా అని, అలా చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని జంగా కృష్ణమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment