నిధులు రాబట్టుకోవడంపై ఎందుకు నోరువిప్పడం లేదు?
ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ప్రజలను బలి చేస్తారా?
పట్టణ ప్రాంతాల్లో హెల్మెట్ వినియోగంపై సడలింపునివ్వాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరం మున్సిపాలిటీ : తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి దాసోహమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల.వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. ఓవైపు రాష్ట్రంలో కురుస్తున్న కుంభవృష్టితో రూ.వేలకోట్లలో నష్టం వాటిల్లితే కేంద్ర నుంచి తక్షణ సాయాన్ని పొందలేకపోవడం దారుణమన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్య పార్టీగా చెప్పుకుంటున్న చంద్రబాబు ఓటుకు నోటు కేసులో బయటపడేందుకు లొంగిపాయి రాష్ట్ర ప్రజలను అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల్లా తమిళనాడు రాష్ట్రంలో కురిస్తే అక్కడి ప్రభుత్వం కేంద్రం నుంచి తక్షణ సాయం కింద రూ.939 కోట్ల నిధులను మంజూరు చేయించుకుందన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు రాబట్టుకోలేకపోయారన్నారు.
ఇస్తామన్నా సాధించలేకపోయారు
గత ఏడాది సంభవించిన హుద్‌హుద్ తుఫాన్ నేపథ్యంలో రూ.వెయ్యి కోట్లు ఇస్తామని స్వయానా కేంద్రం ప్రకటిస్తే అందులో సగం కూడా సాధించలేకపోయారన్నారు. ఇందుకు చంద్రబాబు లొసుగులే కారణమని ఫలితంగా రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు.
నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే సందర్బంలో అక్కడ ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ ఏడాది అది చేస్తా.. ఇది చేస్తా.. నెల్లూరును మార్చేస్తా అని గొప్పలకు పోయే ప్రకటనలు చేయడాన్ని ఖండించారు.
సహాయక చర్యలు సిగ్గుసిగ్గు
ఇదే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించిన సందర్బంలో అక్కడి ప్రజల ఆవేదన చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అర్థమవుతున్నాయంటూ పెదవి విరిచారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరి చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే పట్టణ ప్రాంతాల్లో ఈ నిబంధనను సడలించాలని కోరారు. ఈ విషయంపై ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.