
సీఎం చంద్రబాబుపై 8న ఫిర్యాదులు
విజయనగరం మున్సిపాలిటీ: అధికారంకోసం ఎన్నికల ముందు లెక్కలేనన్ని హామీలు ఇచ్చి తీరా సీఎం అయిన తరువాత వాటిని నెరవేర్చకుండా దగా చేసినందుకు చంద్రబాబుపై క్రిమినల్ కేసులు పెడతామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగునాగార్జున తెలిపారు.
ఈ మేరకు శనివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత చేసిన తొలి ఐదు సంతకాల అమలులో విఫలం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడంపై అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల ఎనిమిదో తేదీన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులు చేయనున్నట్టు తెలిపారు.
పాలనలో వైఫల్యాలవల్ల ఇక భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే అవినీతిసొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు విమర్శించారు. తద్వారా ప్రతిపక్ష పార్టీని బలహీనపర్చాలని చూస్తున్నారనీ, అయితే ఇంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినంత మాత్రాన చంద్రబాబేమీ ప్రధానమంత్రి అయిపోరనీ, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష హోదా పోదన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు బాబు పాల నను గమనిస్తున్నారని, ఆయనకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిం చారు. ఎన్నికలకు ముందు తానెం తో అనుభవశాలిని అంటూ ప్రజలను ప్రలోభపెట్టి, రెండేళ్ల పాలనలో ఏమీ సాధించలేదని, ఇప్పుడు బాధ్యాతారాహిత్యంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఏ ఒక్క హమీని అమలుచేయలేదనీ, పరిపాలన గాలికొదిలేశారని తూర్పారబట్టారు. కేవలం తన కుటుంబ ప్రయోజనాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్వప్రయోజనాలకే బాబు ప్రాధాన్యమిస్తున్నారని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు.
ఇలా చంద్రబాబు చేస్తున్న ప్రజాద్రోహానికి వ్యతిరేకంగా క్రిమినల్ కేసులు పెట్టాలని పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యం కోసం, రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, విజయనగరం పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు. సీనియర్ కౌన్సిలర్ ఎస్.వి.వి.రాజేష్, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బొద్దాన అప్పారావు, యువజన విభాగం నాయకులు జి.వి.రంగారావు, ఎస్.బంగారునాయుడు, అల్లు చాణక్య, మాజీ కౌన్సిలర్‌లు పట్నాన పైడిరాజు, లీగల్‌సెల్ నాయకులు ద్వారపురెడ్డి స్వరూప్, రెడ్డి గురుమూర్తి, మార్రోజు శ్రీను, గండ్రేటి. సన్యాసిరావు, మండల పార్టీ నాయకులు భోగి రమణ, సత్తిరాజు, లెంకజగ్గునాయుడు, పండు తదితరులు పాల్గొన్నారు.