విలేకరులతో మాట్లాడుతోన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి
కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నా పెద్ద ఆర్థిక నేరగాడు దేశంలో మరెవ్వరూ లేరని రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 18 కేసుల్లో స్టే తెచ్చుకొని, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కంటే పెద్ద దొంగ ఎవరుంటారని ప్రశ్నించారు. శని వారం కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాపై టీడీపీ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌సీపీ పోరాడుతుంటే సీఎం, టీడీపీ నాయకులు అవహేళన చేశారని, జల్లికట్టు స్ఫూర్తితో అన్ని పార్టీలు కలిసి ఉద్యమిద్దామని పిలు పునిస్తే పందులు, కుక్కల ఫైట్ కోసం పోరాటం చేయాలా అని ఎగతాళి చేశారని తెలిపారు.
ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధర్నాలు, దీక్షలు, యువభేరీల ద్వారా వివరించి, ప్రజలను చైతన్యవంతులను చేశారని చెప్పారు. ప్రజల్లో వచ్చిన చైతన్యం చూసి బాబు స్టాండ్ మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వైఎస్ జగన్ ప్రకటించగానే టీడీపీలో కదలిక మొదలైందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి మైలేజీ వస్తుందనే ఎన్‌డీఏకు మద్దతు ఉపసంహరించుకున్నారని, రాత్రి 9 గంటలకు అవిశ్వాసంపై నిర్ణయం తీసుకొని 10గంటలకల్లా అన్ని పార్టీలు తమకే మద్దతు ఇస్తున్నాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
దాదాపు అన్ని ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకొని పోటీచేసిన చంద్రబాబు, వైఎస్‌ఆర్‌సీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. హోదా ఇవ్వనని చెప్పిన బీజేపీతో వైఎస్‌ఆర్‌సీపీ పొత్తు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించకుండా కమీషన్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. ఎన్నికల దగ్గరపడుతున్న సమయంలో టీడీపీ, బీజేపీలు నాటకాలాడుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ తప్పులన్నింటికీ ప్రజ లు తగిన శిక్ష వేస్తారని హెచ్చరించారు. వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, మాజీ అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, జెడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, బి. కిషోర్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment