గిరిజనులను మనుషులుగా గుర్తించని ప్రభుత్వం
గిరిజనులను మనుషులుగా గుర్తించని ప్రభుత్వం
Published Fri, Jul 28 2017 11:15 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
గుర్తేడు మండల కేంద్రం ఏర్పాటు కృషి
పీహెచ్‌సీల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచాలి
అన్న వస్తున్నాడు.. చీకట్లు తొలగిపోతాయి..
చాపరాయి మృతుల కుటుంబాలకు జగన్ ఆర్థిక సహాయం
బాధిత కుటుంబాలకు అందజేసిన కన్నబాబు, రాజేశ్వరి, అనంతబాబు
రంపచోడవరం/మారేడుమిల్లి : కనీస వైద్య సదుపాయాలు లేక గిరిజనులు అల్లాడుతున్నారని, ప్రభుత్వం వారిని మనుషులుగా గుర్తించడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. వరుసగా మరణాలు సంభవిస్తున్నా పీహెచ్‌సీల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరచడంలో అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. చాపరాయి గ్రామాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించినప్పుడు బాధిత కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక సాయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ శుక్రవారం అందజేశారు. కన్నబాబు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ సాయం అందజేసినట్టు తెలిపారు. ఎప్పటి నుంచో గుర్తేడు మండల కేంద్రం ఏర్పాటుకు గిరిజనులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం మండల కేంద్రం ఏర్పాటు చేయకపోతే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తామన్నారు. గుర్తేడు పీహెచ్‌సీల్లో అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. రెండు రోజులు క్రితం అంబులెన్స్ లేకపోవడంతో ఒకరు మృతి చెందారని ఆరోపించారు. పాతకోట గ్రామంలో అనారోగ్యంతో గిరిజనులు మృతి చెందుతున్నారని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2వేలు పింఛన్, పిల్లలను బడికి పంపితే రూ.1000 వంటి తొమ్మిది పథకాల అమలుతో పేదలకు మేలు జరుగుతుందన్నారు. గిరిజనులకు పక్కా ఇళ్లు, రోడ్డు నిర్మాణాలు చేస్తామన్నారు. చాపరాయి బాధిత కుటుంబాలకు మంత్రి పంపిణీ చేసిన చెక్కులు వారి అకౌంట్‌లో వచ్చే నెల వరకు పడనప్పుడు ఎందుకు హడవిడిగా ఇచ్చారని ఆరోపించారు. చాపరాయి బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వై.రామవరానికి చెందిన కర్రా వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఐటీడీఏలో చెక్కుల పంపిణీకి పిలిచి మంత్రి నక్కా ఆనందబాబు దారుణంగా మాట్లాడారన్నారు. మీరు మాట్లాడకండి అంటూ బయటకు వెళ్లండి అంటూ బెదిరింపు దోరణిలో మాట్లాడరని ఇదేనా గిరిజనులకు ఇచ్చే మర్యాద అని విమర్శించారు. సర్పంచ్ మరిగెల నర్సమ్మ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే చెక్‌పవర్ రద్దు చేస్తామని, 16 కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాటిని లెక్కచేసే పరిస్థితి లేదన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమ్మిశెట్టి బాలకృష్ణ, జెడ్పీటీసీలు సత్తి సత్యనారాయణరెడ్డి, పల్లాల రమణమ్మ, మండల కన్వీనర్లు జల్లేపల్లి రామన్నదొర, నండూరి గంగాధరరావు, పార్టీ నాయకులు చంటి, గంగరాజు, బాలాజీబాబు, రామాంజనేయులు, సర్పంచ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement