శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం
అమరావతి: ఇటీవల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం పొందింది. కేవలం పదిరోజుల్లోనే ఆయన రాజీనామాను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఆమోదించారు. టీడీపీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్న సందర్భంగా నైతిక విలువలకు కట్టుబడి ఎమ్మెల్సీ పదవికి శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేశారు. ఉదాత్తమైన విలువలను కాపాడాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సూచన మేరకు చక్రపాణిరెడ్డి తన పదవిని వదులుకున్నారు.
అదే టీడీపీలో చేరిన 'ఫిరాయింపు' ఎమ్మెల్యేలు ఏమాత్రం విలువలకు కట్టుబడకుండా పదవిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు టీడీపీ సర్కారు ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు ప్రజాతీర్పు ఉల్లంఘించి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లోనే ఉంది. ఈ పిటిషన్‌పై చర్యలు తీసుకోవడానికి ఒకవైపు మీనమేషాలు లెక్కబెడుతుండగా.. మరోవైపు విలువలకు కట్టుబడిన శిల్పా చక్రపాణి రాజీనామా ఆమోదం పొందడం గమనార్హం.