సాక్షి, అమరావతి : ఫోన్ నంబర్లను కేంద్రం మారుస్తోందంటూ జరిగిన ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ప్రస్తుతం 10 సంఖ్యలుగా ఉన్న మొబైల్ నంబర్‌ను 13 సంఖ్యలకు మారుస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) రంగంలోకి దిగి ఈ ప్రచారం అవాస్తవమని తెలిపింది.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) కూడా మొబైల్ నంబర్లను 13 సంఖ్యలకు మార్చే యోచన లేదంటూ ట్వీట్ చేసింది. కేవలం 13 నంబర్లు మెషిన్ టు మెషిన్ (ఎం2ఎం) సిమ్‌లకు మాత్రమే వర్తిస్తాయని, సాధారణ సిమ్‌లకు అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. మరింత భద్రత కోసం వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎం2ఎం సిమ్‌లలో 13 సంఖ్యల నంబర్‌ను జూలై 1 నుంచి జారీ చేయాలని డీవోటీ అన్ని టెలికం కంపెనీలను జనవరిలో ఆదేశించింది.
ప్రస్తుతం 10 నంబర్లు ఉన్న ఎం2ఎం నంబర్లను 13 సంఖ్యల్లోకి మారడానికి అక్టోబర్ 1 నుంచి అనుమతిస్తారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వెహికల్ ట్రాకింగ్, అసెట్ ట్రాకింగ్, ఎక్విప్‌మెంట్ ట్రాకింగ్ వంటి సేవలకు ఎం2ఎం సిమ్‌లను వినియోగిస్తారు. సాధారణ సిమ్‌లతో పోలిస్తే వీటిలో డేటా స్టోరేజ్ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment