mobile numbers
-
1.4 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్ చేసిన కేంద్రం - కారణం ఇదే..
డిజిటల్ మోసాలను నియంత్రించేందుకు, ఆర్థిక మోసాలకు పాల్పడిన సుమారు 1.4 లక్షల మొబైల్ నంబర్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ 'వివేక్ జోషి' శుక్రవారం 'సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్' (CFCFRMS) ప్లాట్‌ఫారమ్‌లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆన్‌బోర్డింగ్‌తో సైబర్ దాడులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. CFCFRMS ప్లాట్‌ఫారమ్‌ను నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)తో అనుసంధానం చేయడం కోసం పోలీసులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య సమర్థవంతమైన సహకారాన్ని అందించడం, సరైన సమయంలో పర్యవేక్షించడం, మోసపూరిత కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం వంటి విషయాలను కూడా చర్చించినట్లు సమాచారం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సాధారణ 10 అంకెల సంఖ్యల వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయాలని TRAI సూచించిన విధంగా వాణిజ్య లేదా ప్రచార కార్యకలాపాల కోసం ప్రత్యేకించిన నెంబర్ సిరీస్‌లను ఉపయోగించాలని చర్చించుకున్నారు. అంతే కాకుండా నకిలీ డాక్యుమెంట్లతో తీసుకున్న మొబైల్ కనెక్షన్లను గుర్తించేందుకు టెలికామ్ శాఖ ఏఐ టెక్నాలజీ తీసుకురానుంది. ఆర్థిక మోసాలకు పాల్పడిన సుమారు 1.40 లక్షల మొబైల్ నంబర్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. బల్క్ ఎస్ఎంఎస్లు పంపిన సంస్థల మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 3.08 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేసిన కేంద్రం, ఈ నేరాలకు పాల్పడుతున్న 500 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌లు పనిచేయవు! కారణం ఇదే.. సైబర్ మోసాలకు గురైన ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడం, మోసపోయిన డబ్బును మోస పూరిత ఖాతాల నుంచి తిరిగి ఇవ్వడానికి కార్యాచరణ ప్రణాళికలు చేపడుతున్నారు. ఇవన్నీ అనుకున్నట్లు జరిగితే.. రాబోయే రోజుల్లో సైబర్ దాడుల నుంచి ప్రజలను విముక్తి లభిస్తుంది. -
రిటైల్ సంస్థలకు షాక్ ఇక ఫోన్ నెంబర్ అవసరం లేదు..!
-
కస్టమర్ల ఫోన్ నంబర్లు తీసుకోవద్దు..రీటైల్ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: మొబైల్ నంబరు ఇవ్వని కస్టమర్లకు రిటైలర్లు సర్వీసులు, రిఫండ్లను నిరాకరిస్తున్న ఉదంతాలపై కేంద్రం దృష్టి సారించింది. ఇటువంటి విధానాలను మానుకునేలా తమ తమ పరిధిలోని రిటైలర్లను కట్టడి చేయాలని పరిశ్రమల సమాఖ్యలకు సూచించింది. ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించే సమయంలో కస్టమర్ల సమ్మతి లేకుండా వారి మొబైల్ నంబర్లు తీసుకోకుండా చూడాలని పేర్కొంది. సీఐఐ, ఫిక్కీ, అసోచాం, పీహెచ్‌డీసీసీఐ, రిటైలర్ల అసోసియేషన్ ఆర్ఏఐ, అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఈ మేరకు లేఖ రాశారు. ఉత్పత్తి లేదా సర్వీసు కొనుగోలుకు వినియోగదారు తన మొబైల్ నంబరు ఇవ్వడాన్ని తప్పనిసరి చేయొద్దని సూచించారు. ‘మొబైల్ నంబరు ఇవ్వడాన్ని తప్పనిసరి చేయడం వల్ల పలు సందర్భాల్లో కస్టమర్లు తమ అభీష్టానికి విరుద్ధంగా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవాల్సి వస్తోంది. ఆ తర్వాత నుంచి వారికి రిటైలర్లు అసంఖ్యాకంగా మార్కెటింగ్, ప్రమోషనల్ సందేశాలు పంపిస్తుండటం సమస్యాత్మకంగా ఉంటోంది‘ అని సింగ్ పేర్కొన్నారు. విక్రయ సమయంలో.. కస్టమరుకు ఇష్టం లేకపోయినా, మొబైల్ నంబరు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం అనేది వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. మొబైల్ నంబరు ఇవ్వలేదన్న కారణంతో వినియోగదారుకు విక్రయించకపోవడం, రిటర్నులు .. ఎక్ఛేంజీలు .. రిఫండ్లను అనుమతించకపోవడం లేదా వినియోగదారు ఫిర్యాదులను పరిష్కరించకపోవడం అనేవి అనుచిత వ్యాపార విధానాల కిందికే వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ సమాఖ్యలు సహకరించి, రిటైలర్లకు తగు సూచనలను ఇవ్వాలని పేర్కొన్నారు. -
ఫోన్ నంబర్ తీసుకుని విసిగిస్తున్నారా? వినియోగదారుల శాఖ కీలక సూచన
న్యూఢిల్లీ: కస్టమర్ల నుంచి మొబైల్ నంబర్ తదితర కాంటాక్ట్ వివరాల కోసం రిటైలర్లు ఒత్తిడి చేయొద్దని కేంద్ర వినియోగదారుల శాఖ సూచన జారీ చేసింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సూచన జారీ అయింది. తమ కాంటాక్ట్ నంబర్‌ను ఇచ్చేందుకు నిరాకరించడంతో రిటైలర్లు సేవలు అందించేందుకు నిరాకరించినట్టు పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ‘‘కాంటాక్ట్ వివరాలు ఇవ్వకుండా బిల్లును జారీ చేయలేమని రిటైలర్లు చెబుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద ఇది పారదర్శకం కాదు. అనుచిత విధానం కూడా. వివరాలు తెలుసుకోవడం వెనుక ఎలాంటి హేతుబద్ధత లేదు’’అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఇక్కడ గోప్యత విషయమై ఆందోళన నెలకొందన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నంబర్‌వన్ హోటల్ ‘రాంబాగ్ ప్యాలెస్’.. ఎక్కడుందో తెలుసా? -
ఆధార్‌తో 90 కోట్ల మొబైల్ నంబర్స్ అనుసంధానం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆధార్‌తో ఒక కోటికిపైగా మొబైల్ నంబర్స్ అనుసంధానం అయ్యాయి. జనవరిలో ఈ సంఖ్య 56.7 లక్షలు నమోదైందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్‌తో పాన్ నంబర్‌ను అనుసంధానించడం ఈ పెరుగుదలకు కారణం అని వివరించింది. ఇప్పటి వరకు 90 కోట్ల మంది ఆధార్‌తో తమ మొబైల్ నంబర్‌ను అనుసంధానించినట్టు అంచనా. ఆధార్‌ను ప్రామాణికంగా చేసుకుని నమోదైన లావాదేవీలు జనవరిలో 199.62 కోట్లు, ఫిబ్రవరిలో 226.29 కోట్లకు చేరుకున్నాయి. 2023 ఫిబ్రవరి వరకు ఇటువంటి లావాదేవీలు 9,255 కోట్లు నమోదు కావడం గమనార్హం. ఈ–కేవైసీ లావాదేవీలు ఫిబ్రవరిలో 26.79 కోట్లు కాగా ఇప్పటి వరకు ఇవి మొత్తం 1,439 కోట్లుగా ఉన్నాయి. -
మొబైల్ నెంబర్లు డిస్కనెక్షన్ : ప్రభుత్వం క్లారిటీ
న్యూఢిల్లీ : ఆధార్ డాక్యుమెంట్లతో జారీ అయిన 50 కోట్ల మొబైల్ నెంబర్లు డిస్కనెక్ట్ అవుతున్నట్టు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆధార్ డాక్యుమెంట్లతో జారీ చేసిన మొబైల్ ఫోన్ నెంబర్లను డిస్కనెక్షన్ చేయబోమని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ రిపోర్టులు పూర్తిగా అవాస్తవమని, అవన్నీ ఊహాగానాలేనని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ), డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డాట్) సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఆ రూమర్లను ప్రజలు నమ్మొద్దని ఇవి సూచించాయి. ఇదంతా ప్రజల్లో భయాందోళన సృష్టించడమేనని పేర్కొన్నాయి. సుప్రీంకోర్టు ప్రకారం, పాత ఆధార్ ఈకేవైసీ బదులు తాజా కేవైసీతో మొబైల్ నెంబర్ పొందాలనుకుంటే, తొలుత వారి ఆధార్‌ను డీలింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అనంతరం అంతకముందు డాట్ సర్క్యూలర్ ప్రకారం తాజా ఓవీడీని సమర్పించి, మొబైల్ నెంబర్‌ను పొందాలి. కానీ ఎలాంటి పరిస్థితులో కస్టమర్ మొబైల్ నెంబర్‌ను మాత్రం డిస్కనెక్ట్ చేయబోమని తెలిపాయి. కొత్త సిమ్ కార్డులను మాత్రమే ఆధార్ ఈకేవైసీ అథెంటికేషన్ ప్రాసెస్‌తో పొందవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టు పేర్కొన్నాయి. పాత మొబైల్ ఫోన్ నెంబర్లను డియాక్టివ్ చేయాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపాయి. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా, మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ ప్రక్రియలో కొత్త సిమ్ కార్డులను పొందవచ్చు. -
సిమ్ లేకుండా కాల్స్ చేసుకోవచ్చు!
న్యూఢిల్లీ : వాట్సాప్, మెసెంజర్ బాటలో.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా వినూత్న అవకాశాన్ని తన కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ దేశీయ తొలి టెలిఫోనీ సర్వీసును ఆవిష్కరించింది. ఈ సర్వీసులతో తాను అందించే మొబైల్ యాప్ ద్వారా భారత్‌లో ఉన్న ఏ టెలిఫోన్ నెంబర్‌కైనా డయల్ చేసుకునేలా అవకాశం కల్పిస్తుంది. దీని కోసం ‘వింగ్స్’ అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇక బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు కంపెనీ మొబైల్ యాప్ ‘వింగ్స్’ను వాడుతూ.. దేశంలో ఉన్న ఏ ఫోన్ నెంబర్‌కైనా కాల్స్ చేసుకోవచ్చు. ‘ప్రస్తుతమున్న పోటీకర వాతావరణంలో, బీఎస్ఎన్ఎల్ మార్కెట్ షేరును పెంచుకోవడం మెచ్చుకోదగినదే. సిమ్ లేకుండా కాల్స్ చేసుకునేలా యూజర్లకు వీలుకల్పిస్తూ.. ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసులు తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు’ అని ఈ సర్వీసులను లాంచ్ చేసిన అనంతరం టెలికాం మంత్రి మనోజ్ సిన్హా అన్నారు. ఈ సర్వీసులను వాడుతూ.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వై-ఫై లేదా మరే ఇతర సర్వీసు ప్రొవైడర్ ద్వారానైనా ఇతర నెట్‌వర్క్‌కు కాల్స్ చేసుకోవచ్చు. వాలిడ్ టెలికాం లైసెన్స్ కలిగి ఉన్న టెలికాం కంపెనీలు వై-ఫై కనెక్షన్‌ను వాడుతూ యాప్ ఆధారిత కాలింగ్ సర్వీసు అందించవచ్చని గతంలోనే టెలికాం కమిషన్ అనుమతి ఇచ్చింది. మామూలు కాల్స్‌కు ఏ మాదిరి ఛార్జీలు అమలవుతున్నాయో అవే ఛార్జీలను టెలికాం ఆపరేటర్లు విధించాలని కూడా ఆదేశించింది . ఈ వారం ప్రారంభంలో ఈ సర్వీసుల రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతాయి. జూలై 25 నుంచి ఈ సర్వీసులు యాక్టివేట్ అవుతాయి. మరోవైపు బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు అందించే డేటా ప్రయోజనాలను కూడా సమీక్షిస్తోంది. తాజాగా రూ.444 ప్యాక్‌ను బీఎస్ఎన్ఎల్ అప్‌గ్రేడ్ చేసింది. దీని కింద అంతకముందు రోజుకు 4 జీబీ డేటా లభిస్తే, ప్రస్తుతం రోజుకు 6 జీబీ డేటా అందివ్వనున్నట్టు తెలిపింది. రోజుకు 6 జీబీ డేటా మాత్రమే కాక, అపరిమిత ఆన్-నెట్ వాయిస్ కాల్స్‌ను కూడా 60రోజుల పాటు అందించనుంది. -
బ్రాడ్‌బ్యాండ్‌తో కాల్స్ చేసుకోండిలా..
న్యూఢిల్లీ : సిగ్నల్స్ సరిగ్గా ఉండటం లేదా..? మొబైల్ నెట్వర్క్ పనిచేయడం లేదా..? అయితే ఇక నుంచి మీ ఆఫీసులో లేదా ఇంట్లో ఉన్న వై-ఫై బ్రాడ్‌బ్యాండ్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టేయొచ్చట. బ్రాడ్‌బ్యాండ్‌తో మొబైల్ ఫోన్లకు, అదేవిధంగా ల్యాండ్లైన్లకు కాల్స్ చేసుకునేలా ప్రతిపాదనలు రూపొందాయి. దేశంలో ఇంటర్నెట్ టెలిఫోనీకి అనుమతించేందుకు రూపొందించిన ప్రతిపాదనలకు మంగళవారం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనల ప్రకారం టెలిఫోనీ లైసెన్స్‌ను పొందే టెలికాం ఆపరేటర్లు, ఇతర కంపెనీలు సిమ్ అవసరం లేని కొత్త మొబైల్ నెంబర్‌ను ఆఫర్ చేయనున్నాయి. ఇంటర్నెట్ టెలిఫోనీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఈ సర్వీసులను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గత అక్టోబర్‌లోనే టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఈ ప్రతిపాదనలను రూపొందించింది. కాల్ డ్రాప్స్ సమస్యతో బాధపడుతున్న వినియోగదారుల కోసం ఈ కొత్త కనెక్టివిటీ ఆప్షన్లను తీసుకొచ్చింది. అంతర్ మంత్రిత్వ టెలికాం కమీషన్ కూడా ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ ఆమోదంతో ఇక రిలయన్స్జియో, బీఎస్ఎన్, ఎయిర్టెల్ లాంటి టెలికాం ఆపరేటర్లు ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసులను ప్రారంభించుకోవచ్చు. ఈ కొత్త కనెక్టివిటీ ఆప్షన్లతో యూజర్లకు ఎంతో మేలు చేకూరనుందని ట్రాయ్ పేర్కొంది. టెలికాం సిగ్నల్స్ బలహీనంగా ఉన్నప్పటికీ, వై-ఫై అందుబాటు చాలా బలంగా ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ సర్వీసుల కోసం యాక్టివేట్ చేసుకునే టెలిఫోనీ ఒక ఆఫరేటర్ది, మొబైల్ నెంబర్ మరో ఆపరేటర్‌ది అయితే, డౌన్లోడ్ చేసుకునే ఇంటర్నెట్ టెలిఫోనీ యాప్ ఆపరేటర్ నెంబర్‌నే యూజర్లు పొందాల్సి ఉంటుంది. డౌన్లోడ్ యాప్, సర్వీసు ప్రొవైడర్ ఒకే ఆపరేటర్‌ది అయితే నెంబర్ మార్చుకోవాల్సినవసరం లేదని ట్రాయ్ అధికారులు చెప్పారు. -
మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : మొబైల్ యూజర్లకు టెలికాం డిపార్ట్మెంట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆధార్‌తో మొబైల్ నెంబర్ల రీ-వెరిఫికేషన్ ప్రక్రియ గడువును టెలికాం డిపార్ట్మెంట్ పొడిగించినట్టు ప్రకటించింది. ఆధార్ వాలిడిటీపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు ఈ వెరిఫికేషన్ చేపట్టుకోవచ్చని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ప్రస్తుత మొబైల్ సబ్స్క్రైబర్లు ఆధార్ ఆధారితంగా జరిపే ఈ-కేవైసీ ప్రక్రియను, సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు పెంచుకోవచ్చని వెల్లడించింది. అదేవిధంగా ప్రస్తుతం టెలికాం కంపెనీలు పంపుతున్న వాయిస్, టెక్ట్స్ మెసేజ్‌లలో రీ-వెరిఫికేషన్ ప్రక్రియ చివరి తేదీని పేర్కొనకూడదని ఆదేశాలు జారీచేసింది. పలు సర్వీసులకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తప్పనిసరి చేస్తున్న ఆధార్ లింకేజీపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. మార్చి 13న జరిపిన విచారణలో ఆధార్ డెడ్‌లైన్‌ను మార్చి 31 కాకుండా, రాజ్యాంగ బెంచ్ తుది తీర్పు వెల్లడించే వరకు పొడిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి టెలికాం డిపార్ట్మెంట్, ఆటోమేటెడ్ కస్టమర్ కేర్ నెంబర్ 14546 ద్వారా అన్ని ఆపరేటర్లు మొబైల్ నెంబర్ల రీ-వెరిఫికేషన్‌ను చేపట్టేలా వీలు కల్పించింది. తొలుత దీని ద్వారా జరిగే ప్రక్రియకు ఫిబ్రవరి 6ను డెడ్‌లైన్‌గా విధించి, అనంతరం మార్చి 31కి మార్చింది. ప్రస్తుతం ఈ ప్రక్రియను సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు చేపట్టవచ్చని టెలికాం డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఓటీపీ, ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్ ఇవ్వలేని కస్టమర్లకు వారి ఇంటి వద్దే మొబైల్ నెంబర్ రీ-వెరిఫికేషన్ చేపట్టేందుకు డీఓటీ గత అక్టోబర్‌లో అనుమతి ఇచ్చింది. ఆధార్ లేని విదేశీయులు ఈ ప్రక్రియను వారు తమ మొబైల్ నెంబర్ ఆపరేటర్ రిటైల్ అవుట్లెట్కు వెళ్లి, పాస్‌పోర్టు వివరాలు అందించి చేపట్టాల్సి ఉంటుంది. -
మీ ఫోన్ నంబర్లు మారడం లేదు
సాక్షి, అమరావతి : ఫోన్ నంబర్లను కేంద్రం మారుస్తోందంటూ జరిగిన ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ప్రస్తుతం 10 సంఖ్యలుగా ఉన్న మొబైల్ నంబర్‌ను 13 సంఖ్యలకు మారుస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) రంగంలోకి దిగి ఈ ప్రచారం అవాస్తవమని తెలిపింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కూడా మొబైల్ నంబర్లను 13 సంఖ్యలకు మార్చే యోచన లేదంటూ ట్వీట్ చేసింది. కేవలం 13 నంబర్లు మెషిన్ టు మెషిన్ (ఎం2ఎం) సిమ్‌లకు మాత్రమే వర్తిస్తాయని, సాధారణ సిమ్‌లకు అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. మరింత భద్రత కోసం వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎం2ఎం సిమ్‌లలో 13 సంఖ్యల నంబర్‌ను జూలై 1 నుంచి జారీ చేయాలని డీవోటీ అన్ని టెలికం కంపెనీలను జనవరిలో ఆదేశించింది. ప్రస్తుతం 10 నంబర్లు ఉన్న ఎం2ఎం నంబర్లను 13 సంఖ్యల్లోకి మారడానికి అక్టోబర్ 1 నుంచి అనుమతిస్తారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వెహికల్ ట్రాకింగ్, అసెట్ ట్రాకింగ్, ఎక్విప్మెంట్ ట్రాకింగ్ వంటి సేవలకు ఎం2ఎం సిమ్‌లను వినియోగిస్తారు. సాధారణ సిమ్‌లతో పోలిస్తే వీటిలో డేటా స్టోరేజ్ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. -
13 అంకెల మొబైల్ నంబర్లు త్వరలో..అయితే
సాక్షి, ముంబై: దేశంలో 13 అంకెల మొబైల్ నెంబర్‌ను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయంలో దేశంలోని అన్ని టెలికామ్ ఆపరేటర్లకు టెలికాం శాఖ (డిఓటి) ఆదేశాలను జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అమలు కానుంది. అయితే సాధారణ 10అంకెల మొబైల్ యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయం కేవలం మెషీన్ టు మెషీన్ సిమ్ కార్డు నంబర్లకు మాత్రమే వర్తిస్తుంది. రోబోటిక్స్, కార్లు, ట్రాఫిక్ కంట్రోల్, లాజిస్టిక్ సేవలు, సప్లయ్ చైన్ మేనేజ్మెంట్, విమానాల నిర్వహణ, టెలీమెడిసిన్ లాంటి వాటిల్లో కమ్యూనికేషన్స్ కోసం ఈ మెషీన్ టు మెషీన్ సిమ్ కార్డులు వినియోగిస్తారు. సెక్యూరిటీ నేపథ్యంలో ఈ సిమ్ కార్డ్‌ల 13 అంకెల విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేసిక్ కాన్సెప్ట్ అయిన ఈ విధానంలో నెంబర్ పోర్టల్ గడువు 2018 డిసెంబర్ 31తో ముగియనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు. దీనికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జనవరి 8న వచ్చినట్టు చెప్పారు. 13 అంకెల (మెషిన్ టు మెషీన్) నంబరింగ్ ప్లాన్ జూలై ప్రారంభం కానుందని తెలిపారు. దీంతో జూలై 1 తరువాత 13 అంకెల మొబైల్ నంబర్లను మాత్రమే కొత్త వినియోగదారులకు అందించనున్నామని తెలిపారు. కాగా మొబైల్ వినియోగదారుల భద్రతను మరింత పెంచే ప్రయత్నంలో, కేంద్రం 13 అంకెల మొబైల్ నంబర్ విధానాన్ని ప్రవేశపెట్టనుందన్నవార్త కోట్లాదిమంది దేశీయ మొబైల్ వినియోగదారులకు కలవర పెట్టింది. సోషల్ మీడియాలో నెంబర్ పోర్టింగ్ అంశంపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
మొబైల్ నెంబర్లపై కేంద్రానికి కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ : మొబైల్ నెంబర్లకు సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రతి మొబైల్ యూజర్ గుర్తింపుకు సంబంధించిన వివరాలను ఏడాది లోపు సేకరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం 100 కోట్లకు పైగా మొబైల్ యూజర్లున్నారని, వారందరికీ ఆధార్‌ను తప్పనిసరి చేయాలని అపెక్స్ కోర్టు పేర్కొంది. వారందరి వివరాలు సేకరించేందుకు సరియైన మెకానిజం ఏర్పాటుచేసుకోవాలని పేర్కొంది. ప్రీ-పెయిడ్ సిమ్‌కార్డుల గుర్తింపుకు సంబంధించి కూడా వివరాలు సేకరించాలని తెలిపింది. ఏడాది లోపు మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోకూడదని పేర్కొంది. వెరిఫికేషన్ అనేది ఎంతో ముఖ్యమైనదని, ప్రస్తుతం బ్యాంకింగ్ కార్యకలాపాలకు మొబైల్ ఫోన్లనే వాడుతున్నట్టు బెంచ్ సభ్యులు చెప్పారు. ఎన్జీఓ లోక్‌నీతి ఫౌండేషన్ దాఖలుచేసిన ఫిర్యాదుపై విచారించిన బెంచ్ సభ్యులు, నియమ, నిబంధనలతో కూడిన విధానాలను ఏడాదిలోపు రూపొందించుకోవాలని సూచించారు. అప్పుడైతేనే సిమ్ కార్డుల దుర్వినియోగాలకు పాల్పడరని చెప్పారు.