సాక్షి, ముంబై: దేశంలో 13 అంకెల మొబైల్ నెంబర్‌ను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయంలో దేశంలోని అన్ని టెలికామ్ ఆపరేటర్లకు టెలికాం శాఖ (డిఓటి) ఆదేశాలను జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అమలు కానుంది. అయితే సాధారణ 10అంకెల మొబైల్ యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయం కేవలం మెషీన్ టు మెషీన్ సిమ్ కార్డు నంబర్లకు మాత్రమే వర్తిస్తుంది.
రోబోటిక్స్, కార్లు, ట్రాఫిక్ కంట్రోల్, లాజిస్టిక్ సేవలు, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, విమానాల నిర్వహణ, టెలీమెడిసిన్ లాంటి వాటిల్లో కమ్యూనికేషన్స్ కోసం ఈ మెషీన్ టు మెషీన్ సిమ్ కార్డులు వినియోగిస్తారు. సెక్యూరిటీ నేపథ్యంలో ఈ సిమ్ కార్డ్‌ల 13 అంకెల విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేసిక్ కాన్సెప్ట్ అయిన ఈ విధానంలో నెంబర్ పోర్టల్ గడువు 2018 డిసెంబర్ 31తో ముగియనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు. దీనికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జనవరి 8న వచ్చినట్టు చెప్పారు. 13 అంకెల (మెషిన్ టు మెషీన్) నంబరింగ్ ప్లాన్ జూలై ప్రారంభం కానుందని తెలిపారు. దీంతో జూలై 1 తరువాత 13 అంకెల మొబైల్ నంబర్లను మాత్రమే కొత్త వినియోగదారులకు అందించనున్నామని తెలిపారు.
కాగా మొబైల్ వినియోగదారుల భద్రతను మరింత పెంచే ప్రయత్నంలో, కేంద్రం 13 అంకెల మొబైల్ నంబర్ విధానాన్ని ప్రవేశపెట్టనుందన్నవార్త కోట్లాదిమంది దేశీయ మొబైల్ వినియోగదారులకు కలవర పెట్టింది. సోషల్ మీడియాలో నెంబర్ పోర్టింగ్ అంశంపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment