న్యూఢిల్లీ : ఆధార్ డాక్యుమెంట్లతో జారీ అయిన 50 కోట్ల మొబైల్ నెంబర్లు డిస్‌కనెక్ట్ అవుతున్నట్టు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆధార్ డాక్యుమెంట్లతో జారీ చేసిన మొబైల్ ఫోన్ నెంబర్లను డిస్‌కనెక్షన్ చేయబోమని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ రిపోర్టులు పూర్తిగా అవాస్తవమని, అవన్నీ ఊహాగానాలేనని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డాట్) సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఆ రూమర్లను ప్రజలు నమ్మొద్దని ఇవి సూచించాయి. ఇదంతా ప్రజల్లో భయాందోళన సృష్టించడమేనని పేర్కొన్నాయి.
సుప్రీంకోర్టు ప్రకారం, పాత ఆధార్ ఈకేవైసీ బదులు తాజా కేవైసీతో మొబైల్ నెంబర్ పొందాలనుకుంటే, తొలుత వారి ఆధార్‌ను డీలింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అనంతరం అంతకముందు డాట్ సర్క్యూలర్ ప్రకారం తాజా ఓవీడీని సమర్పించి, మొబైల్ నెంబర్‌ను పొందాలి. కానీ ఎలాంటి పరిస్థితులో కస్టమర్ మొబైల్ నెంబర్‌ను మాత్రం డిస్‌కనెక్ట్ చేయబోమని తెలిపాయి. కొత్త సిమ్ కార్డులను మాత్రమే ఆధార్ ఈకేవైసీ అథెంటికేషన్ ప్రాసెస్‌తో పొందవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టు పేర్కొన్నాయి. పాత మొబైల్ ఫోన్ నెంబర్లను డియాక్టివ్ చేయాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపాయి. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా, మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ ప్రక్రియలో కొత్త సిమ్ కార్డులను పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment