
సోమవారం మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది
సాక్షి, అమరావతి: ఎన్నికల రోజైన ఏప్రిల్ 11న గురువారం ఉదయం 5.30కే మాక్ పోలింగ్ ప్రారంభమవుతుందని, ఆ సమయానికే పోలింగ్ ఏజెంట్లు చేరుకోవాలని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. 11న ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలవుతుందని, దానికి ముందే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించడానికి ఏజెంట్ల సమక్షంలో 50 ఓట్ల వరకు మాక్ ఓటింగ్ నిర్వహిస్తామని, ఆ తర్వాత వారి సమక్షంలోనే డిలీట్ చేసి 7 గంటలకు పోలింగ్‌కు ప్రారంభిస్తామని చెప్పారు. 5.30 తర్వాత పావుగుంట వరకు మాత్రమే చూస్తామని, ఆ తర్వాత ఏజెంట్లు ఉన్నా లేకపోయినా మాక్ పోలింగ్‌ను నిర్వహిస్తారని స్పష్టం చేశారు. రెండు రోజులు బల్క్ ఎస్‌ఎంఎస్‌లను నిషేధిస్తున్నట్లు చెప్పారు.
9 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 2,118 మంది, 25 పార్లమెంటు స్థానాలకు 319 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.93 కోట్ల మంది ఓటర్లు ఉండగా వీరి కోసం మొత్తం 45,920 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 9 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓటు వినియోగంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో 85 శాతానికి పైగా పోలింగ్ జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
పోలింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లు నిషేధం..
పోలింగ్ కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో సెల్‌ఫోన్లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించేది లేదని ద్వివేది స్పష్టం చేశారు. స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్లను కూడా లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఎవరైనా ఓటు వేసినట్లు ఫోటోలు తీస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సోమవారం వరకు రూ.196.3 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ మొత్తం రూ.200 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నామన్నారు. పట్టుకున్న మొత్తం పరంగా దేశంలో ఏపీ మూడవ స్థానంలో ఉందని చెప్పారు. నగదు, మద్యం పట్టివేతలో ఏపీనే మొదటి స్థానంలో ఉందని వివరించారు. సోమవారం నాటికి రూ.118.89 కోట్ల నగదు, రూ.24.15 కోట్ల విలువైన మద్యం పట్టుబడినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment