- సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి
సాక్షి, విశాఖపట్నం: ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ ప్రభుత్వం దేశంలో మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ(మార్కిస్టు) పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి ఆరోపించారు. పార్టీ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విశాఖలో ఏప్రిల్ 14 నుంచి 19 వరకు 21వ అఖిల భారత మహా సభలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక సీతారామ కల్యాణ మండపంలో ‘50 ఏళ్ల సీపీఎం ప్రస్థానం-భారతదేశ భవిష్యత్తు’ అనే అంశంపై ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విదేశీపెట్టుబడులు ప్రోత్సహించడం, బ్యాంకులు, బీమా, రక్షణ రంగాల్లో విదేశీ భాగస్వామ్యం, మతోన్మాదాన్ని ప్రోత్సహించడం వంటి ప్రమాద చర్యల్ని కేంద్రం తీసుకుంటోందని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రజల్లో వామపక్షాలకు ఆదరణ తగ్గడంపై విశాఖ మహాసభలో విశ్లేషిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సీహెచ్ నర్సింగరావు, ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, లోకనాధం, గంగారామ్ పాల్గొన్నారు.