సినీ ఫక్కీలో ఏటీఎం నుంచి డబ్బులు స్వాహా | money drwan from ATM in cinema way | Sakshi
Sakshi News home page

సినీ ఫక్కీలో ఏటీఎం నుంచి డబ్బులు స్వాహా

Published Tue, Jan 21 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM

money drwan from ATM in cinema way

 నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేం దుకు వచ్చిన ఓ బాలుడిని నమ్మించి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఏటీఎం కార్డులు తారుమారు చేశాడు. ఆ తర్వాత రెండు ఖాతాల్లోని *46,100 డ్రా చేసుకుని వెళ్లిన సంఘటన ఆల స్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన ఎం.వసురాంనాయక్‌కు స్థానిక ఎస్‌బీహెచ్‌లో, అతని భార్య ఎం.పద్మకు ఎస్‌బీఐలో ఖాతాలున్నాయి. ఈనెల 15న తమ కుమారుడు కుమార్‌నాయక్‌ను ఎస్‌బీహెచ్ ఖాతాలోంచి డబ్బులు తీసుకురావాలని తల్లిదండ్రులు పురమాయించారు. రెండు ఏటీఎం కార్డులు ఒకే కవర్లో ఉండటంతో వాటిని తీసుకుని రాంనగర్‌కాలనీలోని ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్లాడు.
 
 డబ్బులు డ్రా చేసే క్రమంలో అక్కడే ఉన్న ఓ ఆగంతకుడు ‘డబ్బులు అలా డ్రా చేయరాదు, నేను చేసిస్తాను తెమ్ము..’ అంటూ ఏటీఎం కార్డులు తీసుకుని పిన్ కోడ్ తెలుసుకున్నాడు. రూ.500 డ్రా చేసి ఆ బాలుడి చేతిలో ఏటీఎం కార్డులు ఉంచిన కవర్ పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అసలు కార్డులు ఇవ్వకుండా ఏమార్చాడు. ఇది గమనించని కుమార్‌నాయక్ ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 19న తిరిగి డబ్బులు అవసరం ఉండటంతో తండ్రి వసురాంనాయక్ కార్డులున్న కవర్ తీసుకెళ్లి ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసేందుకు యత్నించగా అవి పనిచేయలేదు. పరిశీలిస్తే ఆ రెండు కార్డులు తమవి కావని తేలింది. మారిన రెండు ఏటీఎం కార్డుల్లో ఒకదానిపై గంప రాకేష్‌కుమార్ పేరున ఉన్న స్టేట్ బ్యాంక్ క్యాష్‌కార్డు కాగా, మరొకటి హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు. ఆందోళనకు గురైన అతను బ్యాంకులకు వెళ్లి చూసుకోగా, అప్పటికే భార్య ఖాతా నుంచి రూ.37,900 రెండు విడతల్లో, తన ఖాతా నుంచి రూ.8,200 డ్రా అయినట్టు తెలుసుకుని లబోదిబోమన్నారు.   సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement