
మరింత తగ్గిన వర్జీనియా ధర
దేవరపల్లి, న్యూస్‌లైన్ : వర్జీనియా పొగాకు ధర రోజురోజుకీ పతనమవుతోంది. రోజుకు కిలోకు సగటు ధర రూ. 5 నుంచి రూ.6 తగ్గుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గరిష్ట ధర కిలోకు రూ.166 నుంచి 168 ఇస్తున్నప్పటికి అతితక్కువ బేళ్లకు మాత్రమే ఈ ధర లభిస్తోంది. ఈ నెల 19న కిలో గరిష్ట ధర రూ.177 పలకగా, 21వ తేదీన రూ.165లకు పడిపోయింది. గురువారం మార్కెట్‌లో రూ.159 నుంచి రూ.168 గరిష్ట ధర లభించింది. అయితే 90 శాతం బేళ్లను రూ.162 నుంచి రూ.164కే కొనుగోలు చేశారు. శుక్రవారం ఈ ధర మరింత తగ్గటంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. గురువారం కంటే శుక్రవారం మార్కెట్‌లో సగటు ధర కిలోకు రూ.5 తగ్గటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఐదు వేలం కేంద్రాల్లో రోజుకు సుమారు 5 లక్షల కిలోల పొగాకు కొనుగోలు చేస్తున్నారు. తగ్గిన ధరను బట్టి రోజుకు సుమారు రూ.15 నుంచి రూ.18 లక్షలు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. గత రెండు రోజుల నుంచి కిలోకు రూ.10 సగటు ధర తగ్గిందంటున్నారు. లోగ్రేడు పొగాకు ధర రూ.130 నుంచి రూ.90కు చేరుకోగా, మాడు గ్రేడు కొనేనాధుడు లేడని రైతులు వాపోతున్నారు. వారం రోజుల్లో పొగాకు మార్కెట్ పతనం కావటంతో రైతులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మే 15 తర్వాత మార్కెట్ పుంజుకుంటుందని రైతులతో పాటు అధికారులు భావించారు. అయితే రోజురోజుకు తగ్గటంతో రైతులు అమోమయానికి గురవుతున్నారు.
మున్ముందు మార్కెట్ ఎలా ఉంటుందోనని రైతులు కలవరపడుతున్నారు. పొగాకు కొనుగోలుదారులకు విదేశీ ఎగుమతి ఆర్డర్లు ఇంతవరకు ఖరారు కాకపోవటం వల్ల మార్కెట్ ఒడుదుడుకుల్లో ఉందని అధికారులు అంటున్నారు. ఇందువల్లే కొనుగోలుదారులు పొగాకు కొనుగోలుకు మక్కువ చూపటంలేదని చెబుతున్నారని, ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్ పరిస్థితి అంతుచిక్కటంలేదని దేవరపల్లి వేలం నిర్వహణాధికారి ఎస్‌వీవీఎస్ మూర్తి తెలిపారు. శుక్రవారం దేవరపల్లి వేలం కేంద్రానికి 907 బేళ్లును రైతులు అమ్మకానికి తీసుకురాగా 650 బేళ్లు అమ్ముడు పోయాయి.