అమాయకత్వమే మోసానికి పెట్టుబడి | Mosasaki investment innocence | Sakshi
Sakshi News home page

అమాయకత్వమే మోసానికి పెట్టుబడి

Published Tue, Feb 28 2017 4:36 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Mosasaki investment innocence

పేదల అమాయకత్వం, అత్యాశ మోసగాళ్లకు వరప్రసాదమవుతున్నాయి. గ్లోబల్‌ గివింగ్‌ పేరుతో ఓ ఘరానా మోసగాడు గుంటూరు కేంద్రంగా పేదలకు మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి సుమారు కోటి రూపాయల వరకు రికవరీ చేసినట్టు తెలుస్తోంది.
 
► పోలీసుల అదుపులో గ్లోబల్‌ గివింగ్‌ నిర్వాహకుడు
► రూ.కోటి వరకు రికవరీ చేసిన వైనం
► రాష్ట్రవ్యాప్తంగా ఏడు చోట్ల కేసులు నమోదు
► గుంటూరు అర్బన్ పోలీసుల అదుపులో నిర్వాహకులు కొనసాగుతున్న విచారణ
 
 గుంటూరు:  గ్లోబల్‌ గివింగ్‌ సంస్థ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రూ.3వేలు చెల్లిస్తే రూ.12వేలు ఖరీదు చేసే కుట్టుమిషన్లు ఇస్తామని వేలాది మంది నుంచి కోట్లాది రూపాయల మేర వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేశారు. ఏకంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ కో ఆర్డినేటర్‌లు, టీమ్‌లను ఏర్పాటు చేసి వసూళ్లు చేశారు. చివరకు మోసపోయామని బాధితులు గ్రహించి పోలీసులను ఆశ్రయించడంతో వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది.
 
నెల్లూరుకు చెందిన షేక్‌ ఖాశీం సాహెబ్‌ నిర్వాహకుడిగా గ్లోబల్‌ గివింగ్‌ అనే స్వచ్ఛంద సంస్థను పేరుతో సుమారు ఏడాది కిందట గుంటూరులోని గోరంట్ల ప్రాంతంలో ఉన్న హిమనీనగర్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అతనితో పాటు అతని భార్య రమాదేవి, మేనేజర్‌గా పనిచేసిన చెన్నైకు చెందిన రాణి  కార్యాలయంలో ఉండేవారు. తమ సంస్థకు జింబాబ్వే దేశం నుంచి నిధులు వస్తాయని నమ్మకంగా ప్రచారం చేశారు. దీని కోసం ప్రతి జిల్లాలో కో ఆర్డినేటర్లు, సూపర్‌వైజర్లతో పాటు టీచర్లను నియమించి మురికివాడల్లో నివశించే మహిళలు, మధ్య, దిగువ మధ్యతరగతి మహిళలను లక్ష్యంగా చేసుకుని విస్తృత ప్రచారం చేశారు.
 
నెలకు రూ.500 చొప్పున, ఆరునెలల పాటు రూ.3వేలు చెల్లిస్తే రూ.12వేలు విలువ చేసే కుట్టుమిషన్ ను సబ్సిడీపై అందిస్తామని, దీంతోపాటు తామే దుస్తులు ఇచ్చి ఉపాధి కల్పించి నెలకు కొంత ఆదాయం వచ్చే మార్గం చూపుతామని చెప్పారు. 
 
కోఆర్డినేటర్లే కీలకం
హిమనీ నగర్‌లోని సంస్థ కార్యాలయంలో  కో ఆర్డినేటర్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ప్రధానంగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు షేక్‌ ఖాశింసాహెబ్‌ 13 జిల్లాల్లో పత్రికా ప్రకటనలు, టీవీల ద్వారా ప్రచారంతో పాటు, స్థానికంగా పరిచయాలు ఉపయోగించుకుని 13 జిల్లాల్లో కో ఆర్డినేటర్లను నియమించాడు. ఆతరువాత వారికి అనుబంధంగా సూపర్‌వైజర్లను సంస్థ లక్ష్యాలను వివరించి ప్రతి ఒక్కరితో డబ్బులు కట్టించేలా నియామకం చేశాడు. జిల్లా వ్యాప్తంగా 300 మందికిపైగా కో ఆర్డినేటర్లు, సూపర్‌వైజర్లు ఉన్నారు. వారి ద్వారా నెట్‌వర్క్‌ అంతా నడిపారు.
 
పోలీసుల అదుపులో నిందితుడు
ఈనెల 18 నుంచి పరారీలో ఉన్న నిందితుడిని వారం రోజుల క్రితం గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖాశీం సాహెబ్‌తోపాటు అతని భార్య రమాదేవిని, మేనేజర్‌గా ఉన్న రాణితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు ఎంత మేర వసూలు చేశారనే దానిపై విచారణ నిర్వహిస్తున్నారు. సుమారు కోటి వరకు మొత్తాన్ని వారి నుంచి పోలీసులు రికవరీ చేసి డబ్బులు చెల్లించిన వారందరికి తిరిగి చెల్లించే ఏర్పాటు చేస్తున్నారు. వీరిపై గుంటూరు రూరల్‌ తో పాటు రేణిగుంట, రాజమండ్రి –3 టౌన్, విజయవాడ, మరో మూడు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. గుంటూరులో విచారణ పూర్తి చేసి అరెస్టు చేసిన అనంతరం వేరే జిల్లా పోలీసులకు అప్పగించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement