రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నాలుగు రోజుల పాటు జరగనున్న ప్రపంచ వ్యవసాయ సదస్సులో జిల్లాకు ప్రాతినిధ్యం వహించేందుకు 14మండలాల రైతులకే అవకాశం లభించింది.
=మరో ఇద్దరు అధికారులకు అవకాశం
=అధికారుల వైఫల్యంతో 14మండలాలకే ప్రాతినిధ్యం
=చాలీచాలని భోజన ఖర్చులపై రైతులు పెదవి విరుపు
=శ్రీనివాసరెడ్డి అనే రైతుకు మాట్లాడే అవకాశం
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నాలుగు రోజుల పాటు జరగనున్న ప్రపంచ వ్యవసాయ సదస్సులో జిల్లాకు ప్రాతినిధ్యం వహించేందుకు 14మండలాల రైతులకే అవకాశం లభించింది. సిఫార్సు చేయడంలో అధికారుల వైఫల్యం వల్ల మిగతా మండలాల రైతులకు నిరాశే ఎదురైంది. జిల్లా వ్యాప్తంగా 45మంది రైతులు, ఇద్దరు వ్యవసాయ అధికారులు ప్రపంచ సదస్సులో పాల్గొంటున్నారు. వీరికిచ్చే భోజన ఖర్చులపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజులకు రూ. 275 మాత్రమే ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
దీంతో రైతులు చేతి చమురు వదిలించుకోక తప్పదనిపిస్తోంది. హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో జరగనున్న ప్రపంచ వ్యవసాయ సదస్సుకు ప్రతి జిల్లా నుంచి 50 మంది రైతులు హాజరు కావాలని ప్రభుత్వం అజెండాలో సూచించింది. ప్రతి మండలం నుంచి ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని 20 రోజుల క్రితమే జిల్లా అధికారులను వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశించారు. అయితే, అప్పట్లో వ్యవసాయ అధికారులంతా సమైక్యాంధ్ర సమ్మెలో ఉండటంతో అందుబాటులో ఉన్న రైతుల పేర్లను సిఫార్సు చేశారు. అనకాపల్లి, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, చోడవరం,సబ్బవరం, కశింకోట,కోటవురట్ల, కొయ్యూరు, మునగపాక, దేవరాపల్లి, నాతవరం, పాయకరావుపేట, నక్కపల్లి మండలాల నుంచి 50
మంది రైతుల జాబితా పంపించారు. వారందరికీ వ్యవసాయ శాఖ కమిషనరేట్ వర్గాలు ఏర్పాట్లు పూర్తి చేయడంతో మిగతా మండలాల రైతులు హాజరయ్యేందుకు అవకాశం లేకుండా పో యింది. ముందు పంపించిన జాబితాలోని ఐదుగురు చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు. దీంతో హాజరయ్యే రైతుల సంఖ్య 45కు పరిమితమయ్యింది. వెనక్కి తగ్గిన వారి స్థానంలో కొత్త వారికి అవకాశమిద్దామని జిల్లా అధికారులు భావించినా అందుకు చాన్స్ లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దీంతో 50మంది కోటాను కూడా భర్తీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ జాయింట్ డెరైక్టర్ కార్యాలయంలో ఏఓగా పనిచేసిన విశ్వేశ్వరప్ప, పాయకరావుపేట విస్తరణాధికారి సత్యనారాయణ సమావేశానికి హాజరవుతున్నారు.
నేడు ప్రయాణం
45 మంది రైతులు, ఇద్దరు అధికారులు మంగళవారం బయలుదేరి వెళ్లనున్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు ఆర్టీసీ బస్సుల ద్వారా వీరు హైదరాబాద్‌కు ప్రయాణిస్తారు. భోజన ఖర్చులే ఎటూ చాలవని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులకు ఇస్తున్న రూ. 275 ఎటూ సరిపోవని అంటున్నారు.
భీమిలి రైతుకు మాట్లాడే అవకాశం
ప్రపంచ వ్యవసాయ సదస్సులో భీమిలికి చెందిన బూర శ్రీనివాసరెడ్డికి మాట్లాడే అవకాశం లభించింది. ఇంగ్లీష్‌లో మాట్లాడే వారికి మాత్రం అవకాశమిస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో శ్రీనివాసరెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. వ్యవసాయంలో అనుభవాలను, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బం దుల్ని వివరించనున్నారు.