ఆత్మహత్యకు పాల్పడిన కేదారశెట్టి రమ(ఫైల్) గణేష్‌తేజ, దుర్గా వరహాలు శెట్టి (ఫైల్)
మూడు దశాబ్దాల క్రితం మనసైన వాడిని మనువాడింది... ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోవడంతో కట్టుకున్నవాడి చేయి పట్టుకుని వచ్చేసింది... వారి ప్రేమకు ప్రతిరూపాలుగా ముగ్గురు కొడుకులకు జన్మనిచ్చింది...చిరువ్యాపారంలో భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సమయంలో అనారోగ్యం ఓ కొడుకుని కభళించింది. దాని నుంచి తేరుకునేలోపే విధి భర్తను కూడా దూరం చేసింది. అంతే ఆమె జీవీతంలో ఆనందం దూరమై కొండంత విషాదంఅలముకుంది. దానికితోడు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. కష్టకాలంలో ఆదుకునేవారు లేక... భవిష్యత్‌పై ఆశలు అడియాశలుకావడంతో ఆ ఇల్లాలు తనువు చాలించాలని నిర్ణయానికి వచ్చేసింది... తనతో పాటు తన రక్తం పంచుకు పుట్టిన ఇద్దరి పిల్లలకూఈ కష్టాలు వద్దని విషాన్ని పంచిపెట్టి తనువు చాలించింది... ఆ ఇద్దరు కుమారులు మృత్యువుతో పోరాడుతున్నారు... తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన మంగళవారం పెందుర్తి మండలం చినముషిడివాడ సమీపంలోని అంబేడ్కర్‌నగర్‌లో చోటు చేసుకుంది.
విశాఖపట్నం, పెందుర్తి: ఆర్థిక కష్టాలు భరించలేక ఓ తల్లి సహా ఇద్దరు కుమారులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే తల్లి మరణించగా ఇద్ద రు కుమారుల పరిస్థితి విషమంగాఉంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలస మం డలం గులివిందాడ గ్రామానికి చెందిన కేదారశెట్టి లింగరాజు, రమ(45) 29 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల అం గీకారం లేకపోవడంతో బతుకుదెరువు కోసం చినముషిడివాడ ప్రాంతానికి వచ్చేశారు. వీరికి గణేష్‌తేజ(25), అజయ్‌కుమార్, దుర్గావరహాలుశెట్టి(21) సంతానం. వీరికి సుజాతనగర్‌లో టిఫిన్ దుకాణం జీవనోపాధిగా ఉంది. దీంతో పాటు పండగ సమయంలో సరుకులు ఇచ్చేందు కు ‘పండగ చిట్టీలు’ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఆరు నెలల క్రితం వీరి రెండో కుమారు డు అజయ్‌కుమార్ తీవ్ర అనారోగ్యంతో మరణించాడు.అప్పటి నుంచి లింగరాజు వ్యాపారానికి దూరం కావడంతో పాటు మద్యానికి బానిసై తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పండగ చిట్టీల కోసం సేకరించిన సొమ్ము సుమారు రూ.10లక్షలు అతని వైద్యానికి ఖర్చయిపోయింది. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించి 25 రోజుల క్రితం లింగరాజు కన్నుమూశాడు. దీంతో ఒక్కసారిగా రమ, ఇద్దరు కుమారులపై ఆర్థిక భారం పడింది.
విషం తీసుకున్న తరువాత ఆస్పత్రికి తరలించే సమయంలోబాధితులకు సపర్యలు చేస్తున్న స్థానికులు
సమస్యలుచుట్టుముట్టడంతో...
పండగ చిట్టీల కోసం సేకరించిన సొమ్ము ఇవ్వాల్సిన సమయం దగ్గర పడడంతో వీరి ఆందోళన మరింత పెరిగింది. ఓవైపు కుటుం బం చిన్నాభిన్నం కావడం... మరోవైపు ఆర్థిక ఇబ్బందులు తోడు కావడంతో రమ, గణేష్, వరహాలుశెట్టి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం ఇంటికి విషం తెచ్చుకుని కూల్‌డ్రింక్‌లో కలుపుకుని ముగ్గురూ సేవించారు. కాసేపటికి అటుగా వెళ్తున్న వారు విషం వాసన గమనించి ఏం జరిగిందో అని ఇంటిలోకి చూడగా ముగ్గురూ అపస్మారకస్థితిలో ఉన్నారు. వెంటనే స్థానికులంతా కలిసి వారికి సపర్యలు చేసి 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యలోనే రమ కన్నుమూసింది. గణేష్ తేజ, దుర్గావరహాలుశెట్టి ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. అన్నదమ్ముల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పెందుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రొంగలి అప్పలనాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధితుల పరిస్థితి విషమం
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): పెందుర్తి మం డలం చినముషిడివాడ గ్రామానికి చెందిన అన్నదమ్ములు కడిమిశెట్టి దుర్గ, కడిమిశెట్టి గణేష్‌లు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అత్యవసర వైద్య విభా గంలో చికిత్స పొందుతున్న వీరిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ వీరితో పాటు పురుగుల మందు తాగిన కడిమిశెట్టి రమను ప్రాణం పోయిన తరువాత ఆస్పత్రికి తీసుకురావడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించామని తెలిపారు. అన్నదమ్ముల పరిస్థితి విషమంగా ఉందని, ఇద్దరికీ వెంటిలేటర్ల సాయంతో కృత్రిమంగా ఆక్సిజన్ అందిస్తున్నామని తెలిపారు. వ్యక్తిగత శ్రద్ధతో బాధితులకు అవసరమైన అత్యవసర వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయనతోపాటు ఆస్పత్రి సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, అత్యవసర వైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతిర్మయి, విభాగ సిబ్బంది ఉన్నారు.
బంధువులు ఆదుకునే అవకాశం ఉన్నా..!
ఓ వైపు కుటుంబంలో ఇద్దరిని తక్కువ వ్యవధిలో దూరం చేసుకోవడం... ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం వల్లే రమ కుటుంబం ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. భార్యాభర్తలు టిఫిన్ సెంటర్ నిర్వహించుకుంటుండగా... పెద్దకుమారుడు గణేష్‌తేజ చెన్నైలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నాడు. దుర్గా వరహాలుశెట్టి పెందుర్తిలోని ఓ మెడికల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. 25 రోజుల క్రితం తండ్రి లింగరాజు మరణించడంతో చెన్నై నుంచి వచ్చిన గణేష్ తండ్రి కర్మక్రియలు పూర్తయినా తిరిగి వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయాడు. అయితే ఈ కుటుంబం ఆర్థిక పరిస్థితి, అప్పుల భారం చూసిన స్థానికులు చొరవ తీసుకుని గులివిందాడలో ఉన్న రమ కుటుంబసభ్యుల వద్దకు తీసుకెళ్లారు. దాదాపు 29 ఏళ్ల తరువాత రమ పుట్టిన ఊరికి వెళ్లడంతో వారు కూడా ఆదరించినట్లు తెలుస్తుంది. ఆర్థికంగా ఆదుకునేందుకు సిద్ధమైనప్పటికీ కొంత సమయం కావాలని వారు చెప్పినట్లు బోగట్టా. అయితే పండగకు భారీ ఎత్తున చిట్టీల సామాగ్రి ఇవ్వాల్సి ఉండడంతో రమకు ఆందోళన పెరిగిపోవడం... తక్కువ సమయంలో అంత మొత్తం ఇచ్చే పరిస్థితి లేకపోవడం... చిట్టీలు కట్టిన వారు ఎవరైనా నిలదీస్తే పరువు పోతుందన్న భయంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అంతా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment