గుంటూరు ఈస్ట్,పొన్నూరు: ఇద్దరు బిడ్డలపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న సంఘటన పొన్నూరు రూరల్ మండలం పచ్చలతాడిపర్రులో శుక్రవారం సంచలనం రేపింది. వీరిలో చిన్న కుమార్తె ఆసియా (6) మృతి చెందగా తల్లి మౌలాబీ పరిస్థితి విషమంగా ఉంది. పెద్ద కుమార్తె పర్వీన్ ప్రాణపాయం నుంచి బయట పడింది. సంఘటన స్థలాన్ని బాపట్ల డీఎస్పీ డీ గంగాధరం పరిశీలించారు. స్థానికుల వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ సుభానీ, మౌలాబీలకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడేళ్ల పర్వీన్, ఆరేళ్ల హాసియా అనే కుమార్తెలున్నారు. వివాహం తర్వాత ఏడేళ్లపాటు మౌలాబీ పుట్టినిల్లయిన యడ్లపాడులో కాపురమున్నారు. ఆరు నెలల క్రితం సుభాని కుటుంబ సభ్యులను వదిలి స్వగ్రామంలో ఉంటున్నాడు. 20 రోజుల క్రితం భార్య మౌలాబీ పచ్చలతాడిపర్రు వచ్చి మళ్లీ వెళ్లింది. శనివారం ఉదయం ఇద్దరు కుమార్తెలను తీసుకుని పచ్చలతాడిపర్రు వచ్చింది. ఇదే సమయంలో భార్యాభర్తలు మధ్య వివాదం చోటుచేసుకుంది.
తల్లి పరిస్థితి విషమం
వీరిని జీజీహెచ్ అత్యవసర విభాగానికి తీసుకురాగానే మౌలాబీ కొంత స్పృహలో ఉండి మాట్లాడుతూ తన భర్త ,అత్త, ఆడపడుచు, ఆడపడుచు కుమారుడు వేధింపుల కారణంగానే ఇంతటి ఘోరానికి పాల్పడినట్లు చెప్పింది. అనంతరం స్పృహ కోల్పోయింది. అయితే భర్త మాబుసుభాని మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్ల నుంచి తాను యడ్లపాడులోని అత్తవారింటి వద్దే ఇల్లరికం ఉన్నానని భార్య, అత్త తనతో తరచూ గొడవలు పడుతుండటంతో ఆరు నెలల క్రితం పచ్చలతాడిపర్రు వచ్చేశానని చెప్పాడు. శనివారం తన భార్య ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటికి వచ్చిందని, రాగానే ఘర్షణ పడి కొద్దిసేపటికే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని వివరించాడు.
ఎప్పుడూ గొడవలే..
భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. సుభాని వ్యవసాయ కూలీ. సుభాని స్వగ్రామానికి వచ్చాక కూడా మౌలాబీ కాపురం యడ్లపాడులో పెట్టాలని తరచూ భర్తతో గొడవ పడుతుండేదని తెలిసింది. ఈ నేపథ్యంలో సుభాని నాలుగు రోజుల క్రితం యడ్లపాడు వెళ్లి మౌలాబీ పుట్టింటికి సమీపంలో ఒక ఇల్లు అద్దెకు చూసి వచ్చినట్లు సమాచారం. అయితే ఆ ఇంట్లో సిమెంట్ బస్తాలు ఉండడంతో అవి ఖాళీ చేశాక కాపురం పెట్టాలని భార్యాభర్తలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
పెట్రోల్ బంకులో ఆయిల్ తెచ్చుకుని..
మౌలాబీ ఇంట్లో నుంచి ఒక బాటిల్ తీసుకుని òఆటోలో బంకుకు వెళ్లి పెట్రోలు తీసుకొచ్చింది. ఇద్దరు కుమార్తెలను ఇంట్లోకి పిలిచి తలుపులకు లోపల గడియ వేసి బిడ్డలపై పెట్రోలు పోసి నిప్పంటించింది. ఆ తర్వాత తనపై కూడా పెట్రోలు పోసుకుంది. ఇంట్లో నుంచి చిన్నారుల ఆర్తనాదాలు వినపడడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి తలుపు పగలగొట్టారు. మంటలను ఆర్పివేసి ముగ్గురినీ ఆటోలో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
28 కిలోమీటర్లు ఆటోలోనే..
తీవ్రంగా గాయపడిన మౌలాబీ, ఆమె ఇద్దరు కుమార్తెలను జీజీహెచ్‌కు తరలించేందుకు అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ముగ్గురిని గోనె పట్టాలో చుట్టి అప్పి ఆటోలో తీసుకెళ్లారు. తాడిపర్రు నుంచి గుంటూరు వరకు 28 కిలోమీటర్ల మేరు ముగ్గురు కాలిన గాయాలతో ఆర్తనాదాలు చేస్తూనే ప్రయాణించారు. ఆటో జీజీహెచ్‌కు చేరుకోగానే వారి దయనీయ స్థితికి స్థానికులు చలించిపోయారు. ఆస్పత్రి అత్యవసర విభాగంలో వార్డు బాయ్‌లు అందుబాటులో లేకపోవడంతో అవుట్ పోస్ట్ పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ముగ్గురినీ ఆటోలో నుంచి అత్యవసర విభాగంలోకి తరలించి మానవత్వం చాటుకున్నారు. చిన్నారి షేక్ పర్వీన్ ‘అమ్మా మంటలు అంటూ పెట్టిన ఆర్తనాదాలకు అత్యవసర విభాగంలోని వైద్యులు, ఇతర సిబ్బంది తల్లడిల్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment