ఉద్యమాలతోనే ఫలితం | Movement is the result of match | Sakshi
Sakshi News home page

ఉద్యమాలతోనే ఫలితం

Published Thu, Mar 5 2015 1:41 AM | Last Updated on Tue, May 29 2018 3:40 PM

ఉద్యమాలతోనే ఫలితం - Sakshi

ఉద్యమాలతోనే ఫలితం

ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేయడం అభినందనీయం’ అని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డి అన్నారు.

 వీరపునాయునిపల్లె, కమలాపురం : ‘ప్రజా పోరాటాలకు కమలాపురం నియోజకవర్గం పుట్టినిల్లు. ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేయడం అభినందనీయం’ అని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డి అన్నారు.
 
  గాలేరు-నగరి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతూ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, కడప మేయర్ సురేష్ బాబు, డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, జిల్లా రైతు నాయకుడు శివారెడ్డి, మైనార్టీ నాయకులు ముక్తియార్, జడ్పీ ఛైర్మన్ గూడూరు రవి, డీసీసీబీ ఛైర్మన్ తిరుపాల్‌రెడ్డి తదితరులు దీక్షా శిబిరానికి చేరుకొని సంఘీభావం తెలిపారు.
 
  వైఎస్ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ ప్రజలు, రైతుల కోసం చేసే ఇలాంటి దీక్షలకు అందరూ మద్దతు తెలపాలన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ‘గాలేరు-నగరి’కి ఏ మాత్రం నిధులు కేటాయించలేదని విమర్శించారు. ప్రజలను మాటలతో మభ్యపెట్టే వ్యక్తి చంద్రబాబే అన్నారు.
 
  తాను అధికారంలోకి వస్తే రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన ఆయన ఆఖరుకు.. ఆ హామీలనే మాఫీ చేశారని ఎద్దేవా చేశారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలనే ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారని, రాష్ట్రం అన్నపూర్ణగా ఉండాలని ఆశించి అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారన్నారు. దురదృష్టవశాత్తు ఆయన మరణంతో ప్రాజెక్టులు అసంపూర్తిగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
 
  ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి నేడు ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. వైఎస్ మరణం తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ప్రాజెక్టుల గురించి ఆలోచించలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ‘గాలేరు-నగరి’కి నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
 రాయలసీమ ఎడారవుతుంది
 ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో తాగు, సాగు నీరు లేక రాయలసీమ ఎడారి కానుంది. ‘గాలేరు-నగరి’ పనులు 90 శాతం పూర్తి అయ్యాయి.. మిగిలిన పది శాతం పనులు పూర్తి చేస్తే నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఒత్తిడి చేసి నిధులు తెచ్చుకోలేక పోతోంది. ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారు.
 - ముక్తియార్, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర మైనార్టీ నేత
 
 ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం
 ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన టీడీపీ ప్రభుత్వం త్వరలో గద్దె దిగడం ఖాయం. వైఎస్‌ఆర్ జిల్లాపై సీఎం వివక్ష చూపుతున్నారు. జిల్లా ప్రజలకు తాగు, సాగు నీరు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. జిల్లాలో ఏ మాత్రం అభివృద్ధి పనులు సాగడం లేదు. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తానని చెప్పిన చంద్రబాబు.. జిల్లా అభివృద్ధి మరచిపోయారు. జిల్లాలో గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఏర్పడింది.
 - గూడూరు రవి, జెడ్పీ చైర్మన్
 
 దీక్షకు సంపూర్ణ మద్దతు
 జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరుతూ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేపడుతున్న దీక్షకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. మన హక్కులను మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత సీఎంపై ఉంది. కడపలో ఏర్పాటు చేస్తామన్న ఉర్దూ యూనివర్సిటీని కర్నూలుకు మార్చడం దారుణం. హామీ ఇచ్చి ఇలా మాట తప్పడం సీఎంకు తగదు.
 - నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు
 
 అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన బాబు
 అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీలను గాలికి వదిలి వేశారు. ప్రాజెక్టులపై ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ సంగతి ఏమైంది? ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదు. అలాంటాయన ఇపుడు ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి నీరిస్తామంటే నమ్మే వాళ్లెవరూ లేరు. కేవలం ఆయన అనుచరుల కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్నారు. గాలేరు-నగిరి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకువస్తాం.
 - అంజద్ బాష, ఎమ్మెల్యే, కడప.
 
 గాలేరు-నగరి వైఎస్ చలువే
  గాలేరు-నగరి ప్రాజెక్టు ఇంత వరకు వచ్చిందంటే అది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చలువే. ఈ ప్రాజెక్టు కోసం వైఎస్, మైసూరా రెడ్డిలు పాదయాత్ర కూడా చేశారు. ఎన్‌టీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పటికీ అధిక నిధులు కేటాయించిన ఘనత వైఎస్‌దే . దాదాపు 80-90శాతం పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన పనులకు వైఎస్ మరణం తర్వాత వచ్చిన సీఎంలు నిధులు కేటాయించలేదు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం కోసం  ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొనాలి.  
 - సురేష్‌బాబు, మేయర్, ప్రజా ప్రతినిధులంటే విలువలేదా?
 
 ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు విలువ లేదా? జిల్లా ప్రజల సమస్యలు, ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గండికోట వద్ద వినతిపత్రం ఇస్తుంటే తీసుకోకపోవడం దారుణం. ముఖ్యమంత్రిగా అక్కడకు వచ్చిన ఆయన ఓడిపోయిన వారితో సమీక్షలు చేసి వెళ్లడం అంటే జిల్లా ప్రజలను అవమానించడమే. కాలువపై నిద్రించి అయినా నీరు ఇస్తానని ఆయన చెప్పాడు. కాలువపై నిద్రిస్తే నీరు రాదనే విషయం తెలుసుకుని బడ్జెట్‌లో ఆ మేరకు నిధులు కేటాయించాలి.
 -అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement