కడపసిటీ, న్యూస్‌లైన్ : సమైక్య రాష్ర్ట ఉద్యమానికి అన్ని వర్గాల వారు సహకరించాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు విన్నవించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు చేపట్టిన బంద్ శుక్రవారం విజయవంతమైంది. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు, వైద్యులు సహకరించారు. నగరంలో, ప్రధాన పట్టణాల్లో జనజీవనం స్థంభించింది. మండల కేంద్రాల్లో జనసంచారం లేకుండాపోయింది.
కడప నగరంలో చేపట్టిన బంద్‌కు కొందరు సహకరించకపోవడంతో అక్కడక్కడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు నగరమంతా తిరుగుతూ బంద్‌ను విజవయంతం చేయాలని కోరారు. తెరిచిన దుకాణాలను మూసివేయాలని సూచించారు. కాగా కూరగాయలు, పాలు, మందుల దుకాణాలు వంటి వాటికి బంద్‌లో మినహాయింపునిచ్చారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని మయూర టిఫిన్ సెంటర్ తెరిచి ఉండటాన్ని గుర్తించి నాయకులు లోపలికి వెళ్లి అక్కడున్న తినుబండారాలను విసిరివేశారు. సమైక్య రాష్ట్రం కోసం చేపడుతున్న బంద్‌కు సహకరించకపోతే దాడులు తప్పవని హెచ్చరించారు.
అక్కడి నుంచి ముందుకు వెళుతుండగా విష్ణుప్రియ హోటల్ వద్ద సిబ్బంది గుమిగూడి ఉండటం చూసి వెళ్లిపోవాలని సూచించారు. వారు హోటల్‌లోకి వెళ్లడాన్ని చూసి హోటల్ మూసివేయమంటే లోనికి వెళతారా అంటూ సమైక్యవాదులు లోనికి వెళ్లారు. అక్కడ భోజన పదార్థాలు తయారు చేస్తుండడం చూసి బంద్ చేపట్టాలని కోరుతున్నా సహకరించరని ఆగ్రహం చెందారు. సిబ్బంది వినకపోవడంతో సమైక్యవాదులు ఆగ్రహంతో టేబుళ్ళను తోసివేశారు.
దీంతో హోటల్ టేబుళ్ళపై ఉన్న మార్బుల్ స్టోన్ పగిలిపోయింది. కొన్ని కుర్చీలు విరిగిపోయాయి. సుమారు 10 టేబుళ్ళు, 10 కుర్చీలు విరిగిపోయాయి. సమైక్యవాదులు హోటళ్లు, దుకాణాలు తెరిచి ఉంచితే దాడులు తప్పవని హెచ్చరించారు. హోటల్‌లో ఏం జరుగుతుందని పోలీసులు వచ్చి పరిశీలించేలోగా టేబుళ్లు, కుర్చీలు వంటి సామాగ్రి విరిగిపోయి కనిపించింది. పోలీసులు అందరినీ బయటికి పంపి మూసివేశారు. సమైక్యవాదులు జై సమైక్యాంధ్ర, రాష్ట్ర విభజనను అడ్డుకుంటాం, కేంద్రానికి తగిన బుద్ధి చెబుతాం, సోనియా డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయారు.
ఉద్యమానికి సహకరించాలి
Published Sat, Oct 5 2013 3:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM
Advertisement