సినిమాలు సమాజానికి స్ఫూర్తినివ్వాలి | Movies to inspire community | Sakshi
Sakshi News home page

సినిమాలు సమాజానికి స్ఫూర్తినివ్వాలి

Published Mon, Apr 18 2016 2:03 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

Movies to inspire community

శ్రీమంతుడు చిత్ర నిర్మాతలకు బి.నాగిరెడ్డి స్మారక పురస్కారం
ముఖ్య అతిథులుగా హాజరైన నటులు
గొల్లపూడి మారుతీరావు, చంద్రమోహన్



తిరుపతి కల్చరల్: సినిమాలు  చక్కటి సందేశం ఇస్తూ సమాజానికి స్ఫూర్తినిచ్చేలా ఉండాలని ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు తెలిపారు. ప్రముఖ నిర్మాణ విజయ సంస్థ, విజయ మెడికల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నిర్మాత బి.నాగిరెడ్డి స్మారక పురస్కారం-2015 ప్రదానోత్సవం కార్యక్రమం ఆదివారం రాత్రి తిరుపతి మహతి కళాక్షేత్రంలో  ఘనంగా జరిగింది. శ్రీమంతుడు చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాతలు వై.రవి, నవీన్‌లకు నాగిరెడ్డి స్మారక అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా సినీనటులు గొల్లపూడి మారుతీరావు, చంద్రమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గొల్లపూడి మాట్లాడుతూ నాడు సమాజ సేవా దృక్పథంతో, మానవీయ విలువలతో కూడిన సందేశాత్మక సినిమాలు తీసేవారన్నారు. అయితే నేడు వ్యాపారమే లక్ష్యంగా సినిమాల నిర్మాణాలు సాగడం బాధాకరమన్నారు. గత 65 ఏళ్లుగా సినిమా అంటే ఎలా ఉండాలో తీసి చూపిన వ్యక్తి నాగిరెడ్డి అన్నారు. నిబద్ధత, నిజాయితీ గల వ్యక్తి బి. నాగిరెడ్డి అని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని వారి కుటుంబం గత ఐదేళ్లుగా ఆయన పేరున ఉత్తమ చిత్రాల నిర్మాతలకు నాగిరెడ్డి స్మారక పురస్కారం అందించడం అభినందనీయమన్నారు.


శ్రీమంతుడు చిత్రం స్ఫూర్తితో చాలామంది గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. శ్రీమంతుడు చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాతలు వై.రవి, నవీన్‌లకు నాగిరెడ్డి స్మారక అవార్డు ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. చంద్రమోహన్ మాట్లాడుతూ తనకు నటుడిగా బిక్షపెట్టింది విజయా సంస్థ అని కొనియాడారు. ఎన్టీఆర్ తర్వాత ఆ సంస్థలో హీరోగా తానే నటించే భాగ్యం  ఆ సంస్థ కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ  మంచి చిత్రాలకు కేరాఫ్ విజయ సంస్థ అని తెలిపారు.  ఆ సంస్థ నిర్మించిన చిత్రాల్లో తన తల్లి సావిత్రి నటించడం వల్ల వారితో తమకు ఎంతో అనుబంధం ఏర్పడిందని తెలిపారు.  విజయా మెడికల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకటరామిరెడ్డి, సతీమణి భారతీ రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు ఏళ్లుగా నాగిరెడ్డి స్మారక పురస్కారాలను సమాజానికి హితోదకంగా నిలిచే ఉత్తమ చిత్రాల నిర్మాతలకు అందిస్తున్నామన్నారు. టీటీడీ  చైర్మన్‌గా నాగిరెడ్డి  భగవంతుని సన్నిధిలో విశేష సేవలు అందించడంతో ఐదో పురస్కార ప్రధాన సభను తిరుపతిలో నిర్వహిస్తున్నామన్నారు.

 

అలరించిన మాధవపెద్ది సురేష్ సంగీత విభావరి
బి.నాగిరెడ్డి స్మారక పురస్కార ప్రధాన సభ సందర్భంగా మహతి కళాక్షేత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి శ్రోతలను ఆకట్టుకుంది. అలనాటి విజయా సంస్థ నుంచి వెలువడిన అద్భుత చిత్రాల్లోని పలు పాటలను ఆలపించారు. గాయనీ గాయకులు బీఆర్. నారాయణ, నిత్యసంతోష్,  సునీతారావు, పవన్‌లు గేయాలతో ఆకట్టుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement