మోసం చేయడం.. చంద్రబాబు నైజం
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల : ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు సేవ చేయడం కంటే పారిశ్రామికవేత్తలకు సేవలు చేస్తూ తరించిపోతున్నారన్నారు. చంద్రబాబు ఇలా ఉంటే మరో వైపు దేశం ఎమ్మెల్యేలు యథేచ్ఛగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో అవినీతికి పాల్పడగా.. మరోవైపు సాక్షాత్తు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అవినీతికి అడ్డు తగులుతున్న మహిళా తహశీల్దార్‌పై దాడి చేయడం ఎంత వరకు సమంజసమో దేశం నేతలే ప్రశ్నించుకోవాలన్నారు. చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన దృశ్యాలు అన్ని న్యూస్ చానెల్స్ లో ప్రసారం చేసినా ఇంత వరకు ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. పైగా మహిళా తహశీల్దార్‌పై కేసులు నమోదు చేయించడం హేయమైన చర్య అని ఆయన దుయ్యబట్టారు. అధికార పార్టీ నేతలపై ఒక రకంగా వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై మరో రకంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారన్నారు.
ప్రజా దర్బార్ :
వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి బిజీబిజీగా గడిపారు. తన వద్దకు వచ్చిన ప్రజల సమస్యలను ఓపికగా వింటూ పరిష్కారానికి అధికారులకు ఫోన్లు చేశారు.
♦ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లెకు చెందిన కొందరు వృద్ధులు అన్ని అర్హతలు ఉన్నా తమకు పింఛన్ మంజూరు చేయలేదని ఎంపీకి మొరపెట్టుకోగా.. ఆయన సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి అర్హులైన వారికి పింఛన్ మంజూరు చేయాలని.. అలా కానీ పక్షంలో కోర్టును ఆశ్రయించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
♦ వర్షిత అనే చిన్నారికి కాళ్లు సరిగా లేవని ఆపరేషన్‌కు సాయపడాలని కోరగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
♦ బోనాల గ్రామానికి చెందిన మహిళలు స్థానిక స్పిన్నింగ్ మిల్లులో ఉపాధి అవకాశాలు కోరగా.. ఆయన మేనేజర్‌కు ఫోన్ ద్వారా సిఫార్సు చేశారు.
కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు వేముల సాంబశివారెడ్డి, బల రామిరెడ్డి, మల్లికేశవరెడ్డి పాల్గొన్నారు.