ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్
కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పులివెందుల వైఎస్‌ఆర్ సీపీ కార్యాలయంలో ఆయనను నిర్భంధించారు. కాగా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్తగా అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ పైడిపాలెం రిజర్వాయర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్వప్నమన్నారు.
రిజర్వాయర్ 90 శాతం పనులు వైఎస్‌ఆర్ పూర్తి చేశారని, అయితే చంద్రబాబు ఇప్పుడు అన్ని తానే పూర్తి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. తనను నిర్బంధించడం ప్రతిపక్షాల గొంతు నొక్కడమే అని, జన్మభూమిలో సమస్యలు చెప్పుకోవాలంటున్నారని, మరి సమస్యలు చెప్పడానికి వస్తే అరెస్ట్ చేయడం న్యాయమా అని అవినాష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
కాగా సీఎం గండికోట పర్యటన దృష్ట‍్యా మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీని పోలీసులు నిన్నే గృహ నిర్బంధం చేశారు. గత కొన్నిరోజుల నుంచి గండికోట ముంపువాసులకు పరిహారం కోసం జయశ్రీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.